
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ, నిల్వ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. శ్రీవారి ప్రసాదాల భద్రత, పోషక విలువలు, నాణ్యత మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ఐఆర్–సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూరుతో టీటీడీ అవగాహన ఒప్పందం చేసుకుంది. శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ ఆధ్వర్యంలో తయారై, పంపిణీ అయ్యే ఆహార పదార్థాలు అత్యున్నత భద్రతా ప్రమాణాలు, పోషక విలువలు, నాణ్యతతో భక్తులకు అందేలా చేసేలా చర్యలు చేపట్టింది. ప్రసాదాలు ఆహార పదార్థాలు సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు టీటీడీ సీఎస్‌ఐఆర్–సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ) మైసూరు మధ్య ఎట్టకేలకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా టీటీడీ ఆహార నిర్వహణ వ్యవస్థల్లో శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టనుంది
ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవే…
భద్రత, నాణ్యత నియంత్రణ బలోపేతం చేయనుంది. ముడి పదార్థాల కొనుగోలు, ఆహార తయారీ, పంపిణీ ప్రక్రియలలో కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌ఓపీలు), పర్యవేక్షణ వ్యవస్థలను టీటీడీ–సీఎఫ్‌టీఆర్‌ఐ సంయుక్త బృందాలు రూపొందించి అమలు చేస్తాయి.
ఆధునికీకరణకు మార్గదర్శకత్వం…
ఇక నిల్వ, నాణ్యత పరీక్షలు, ముడి పదార్థాల కొనుగోలు వ్యవస్థల ఆధునికీకరణకు సీఎఫ్‌టీఆర్‌ఐ సాంకేతిక సలహాలు అందిస్తుంది. శాస్త్రీయంగా ధృవీకరించిన సాంకేతికతలు, ఉత్తమ విధానాల అమలు ద్వారా కలుషిత ప్రమాదాలను తగ్గించి, నాణ్యతలో స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది.