
ఏలూరు జిల్లా మండవల్లి మండలం అల్లినగరం గ్రామంలో రైతుల సమక్షంలో 500 కిలోల ఘనజీవామృతం తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఘనజీవామృతం తయారీ విధానం, దాని ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డివిజనల్ ఇన్‌చార్జి, ట్రైనింగ్ అసోసియేట్ (ఎన్‌ఎఫ్‌ఏ) డి. మధుబాబు మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఘనజీవామృతాన్ని వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా 500 కిలోల ఘనజీవామృతాన్ని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను రైతులకు వివరించారు.
ఆవుపేడ, ఆవుమూత్రం, బెల్లం, శనగపిండి, మట్టితో తయారయ్యే ఘనజీవామృతం భూమిలో సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి భూసారాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ఇది పంటలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తీసుకువచ్చి వేర్ల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
అదేవిధంగా నేలలో తేమ నిల్వ ఉండేలా చేసి పంటల పెరుగుదల, దిగుబడి, నాణ్యత పెంపులో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. తక్కువ ఖర్చుతో భూమి ఆరోగ్యాన్ని కాపాడే ఈ ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్‌ను ప్రతి రైతు స్వయంగా తయారు చేసుకుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎమ్‌టీలుగా నాగవిజయ, గౌతమ్ కుమార్, అహోబలరావు, ఐసీఆర్పీలు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





