News

గోమాతకు జాతీయ జంతువు హోదా కల్పించాలంటూ జంగారెడ్డిగూడెంలో మానవహారం

6views

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బోసు బొమ్మ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలిచింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో గోమాతకు విశిష్ట స్థానం ఉందని అన్నారు. హిందూ సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం సోదరులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు మొహమ్మద్ అబ్దుల్ నబీ మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సమైక్య భావంతో ముందుకు వచ్చి గోమాతకు జాతీయ జంతువు హోదా కల్పించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గో సంరక్షణ, గోమాత ప్రాధాన్యంపై సమాజంలో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొప్పాక శ్రీనివాసరావు, విశ్వహిందూ పరిషత్ నాయకుడు తిప్పాభట్ల రామకృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్నవారు గోమాత భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.