News

కొండవీడులో వెలుగులోకి వచ్చిన శాసనం

7views

పల్నాడు జిల్లా కొండవీడులో రెడ్డిరాజుల కాలానికి చెందిన ఓ అరుదైన శాసనం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొండవీడు గిరుల్లోని రుద్రపాదం కొండ శిఖరంపై ఉన్న పురాతన శివాలయంలో ఈ శాసనం గుర్తించినట్లు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి తెలిపారు.

ఆయన వివరాల ప్రకారం, క్రీ.శ. 14వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ శివాలయంలోని ద్వారపాలక స్తంభంపై శాసనం చెక్కబడి ఉంది. ప్రస్తుతం ఆలయం శిథిలావస్థకు చేరుకోగా, గర్భగుడి మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలిపారు.

రెడ్డిరాజుల ప్రముఖ పాలకుడు అనవేమారెడ్డి పరిపాలన కాలంలో కొండవీడు కొండపై రెండు శివాలయాలు నిర్మించబడినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోందని శివారెడ్డి పేర్కొన్నారు. ఈ శాసనం రెడ్డిరాజుల కాలంలోని ధార్మిక, సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

కొండవీడు ప్రాంతంలో అనామకంగా, నిర్లక్ష్యంగా పడి ఉన్న పలు శాసనాలను గుర్తించి, వాటిని పరిశీలించి భద్రపరచేందుకు భారత పురావస్తు సర్వేక్షణ శాఖ (ఏఎస్ఐ) మరియు సంబంధిత పురావస్తు శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.