
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఇప్పటివరకు బహిరంగంగా మాట్లాడని ఒక నిజాన్ని అక్కడి రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టారు. “మా పూర్వీకులు హిందువులే” అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ, మత వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా హిందూ చరిత్రను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖ్వాజా ఆసిఫ్, “పాకిస్తాన్ ముస్లింలలో చాలామంది తమ హిందూ పూర్వీకులను ద్వేషించేలా తయారయ్యారు. దిగువ వర్గాల ప్రజలు తమ మూలాలు సౌదీ అరేబియా లేదా ఇరాన్‌లో ఉన్నాయని తప్పుడు గర్వంతో చెబుతున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే – వారి పూర్వీకులు ఈ భారత భూమికే చెందిన హిందువులే” అని స్పష్టం చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, పాకిస్తాన్‌లో విద్యా వ్యవస్థ ద్వారా వక్రీకరించిన చరిత్రను పిల్లలకు బోధిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “చంద్రగుప్త మౌర్యుడు, చక్రవర్తి అశోకుడు వంటి మహా భారత చక్రవర్తుల చరిత్రను కేవలం వారు హిందువులు కాబట్టే పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు” అని ఆరోపించారు.
“నా పూర్వీకులు హిందువులు అయినంత మాత్రాన నేను పాకిస్తానీని కాకుండా పోతానా?” అని ప్రశ్నించిన ఆసిఫ్, దేశపు అసలైన సాంస్కృతిక మూలాలను ప్రజల నుంచి దూరం చేశారని అన్నారు. పాకిస్తాన్ సమాజాన్ని విదేశీ శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేందుకు తప్పుడు చరిత్రను రాసి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేశారని కూడా విమర్శించారు.
“ఈరోజు పాకిస్తాన్‌లో చాలామందికి చంద్రగుప్త మౌర్యుడు ఎవరో, అశోకుడు ఎవరో కూడా తెలియదు. మన పిల్లలకు నిజమైన చరిత్ర బోధించడం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా – ఇజ్రాయెల్ మధ్య అబ్రహం ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాకిస్తాన్‌లో దాచిపెట్టబడిన హిందూ మూలాలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.





