
0views
అయోధ్య రామ మందిర ఆవరణలో వున్న దుర్గా దేవాలయం ధ్వజారోహణ కార్యక్రమం ఈ నెల 29 న జరగనుంది. ప్రముఖ సాధ్వీ సాధ్వీ రితింభర ఆలయం వద్ద ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు ప్రత్యేకంగా “మాతృశక్తి” లేదా మహిళా శక్తికి అంకితం చేశారు.
‘మాతృశక్తి’ ఇతివృత్తాన్ని దృష్టిలో ఉంచుకుని, వివిధ మత, సామాజిక మరియు సాంస్కృతిక సంస్థలకు చెందిన 3,500 మందికి పైగా మహిళలను ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్, దుర్గా వాహినితో పాటు బీజేపీ మహిళా విభాగాలతో పాటు అనేక ఇతర సంఘాలకు చెందిన ప్రతినిధులను కూడా ఆహ్వానించారు.
అయితే.. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ ప్రత్యేకంగా జారీ చేసిన పాసులు అందుకున్న అతిథులే రావాల్సి వుంటుందని ట్రస్ట్ పేర్కొంది. ఈ కార్యక్రమానికి సుమారు 4 వేల మందిని ఆహ్వానించారు.పతాక ఆవిష్కరణ తర్వాత వచ్చిన అతిథులందరికీ రామ్ లల్లా మందిరం, రామ్ పరివార్ విగ్రహాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే.. ఈ కార్యక్రమం జరుగుతున్నా.. సాధారణ భక్తుల దర్శనాలు మాత్రం కొనసాగుతాయని ట్రస్ట్ ప్రకటించింది.
అయితే.. దేవాలయ ఆవరణలోని దేవాలయాల్లో జరిగే ధ్వజారోహణ కార్యక్రమం ఇదే చివరిది. గతంలో మాత అన్నపూర్ణ, సూర్యదేవుడు, హనుమంతుడు, గణేశుడు మరియు పరమశివుని దేవాలయాల దగ్గర ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా మిగిలి ఉన్న మరొక ఆలయం శేషావతార మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం జూన్ 23న జరగనుందని భావిస్తున్నారు.




