News

హిమాలయాలు భారతదేశ భద్రతా కవచం

4views

జమ్మూ సైనిక్ కాలనీలోనిలాక్సీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో, భారత్ టిబెట్ సహయోగ్ మంచ్ ఆధ్వర్యంలో మే 2–3 తేదీల్లో రెండు రోజుల జాతీయ కార్యనిర్వాహక సమావేశం మరియు సెమినార్ నిర్వహించబడింది. “21వ శతాబ్దంలో హిమాలయాలు: భారతదేశ భద్రత, సవాళ్లు మరియు ఆవిర్భవిస్తున్న కోణాలు” అనే ఇతివృత్తంపై ఈ కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, విధాన రూపకర్తలు, సామాజిక కార్యకర్తలు హిమాలయాల వ్యూహాత్మక, సాంస్కృతిక మరియు పర్యావరణ ప్రాముఖ్యతపై చర్చించారు.

భారత్ టిబెట్ సహయోగ్ మంచ్ ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ, హిమాలయాలను భారతదేశపు సహజ భద్రతా కవచంగా అభివర్ణించారు. దాని పర్యావరణ, సాంస్కృతిక లేదా వ్యూహాత్మక సమతుల్యతను దెబ్బతీసే ఏ ప్రయత్నమైనా దేశ సార్వభౌమాధికారానికి సవాలుగా మారుతుందని హెచ్చరించారు. విస్తరణవాద ధోరణులను ఎదుర్కోవాలంటే జాతీయ ఐక్యత, స్పష్టమైన విధానాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి మరియు ప్రజల క్రియాశీల భాగస్వామ్యం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్య రూపేష్ కుమార్, సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ, వినూత్న పథకాల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం కల్పించాలని సూచించారు.

కేంద్ర టిబెటన్ పరిపాలన మాజీ విద్యాశాఖ మంత్రి తుప్టెన్ లుంగ్రిగ్ మాట్లాడుతూ, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. హిమాలయ ప్రాంతంలో అస్థిరత ఆసియా శాంతిపై ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, సహకారం మరియు పరస్పర అవగాహన అవసరమని తెలిపారు.

జాతీయ ప్రధాన కార్యదర్శి పంకజ్ గోయల్ సంస్థ విస్తరణకు సంబంధించి మార్గదర్శకాలు అందించగా, కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లెఫ్టినెంట్ జనరల్ ఆర్.కె. శర్మ (రిటైర్డ్) వ్యూహాత్మక సంసిద్ధత, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక అవగాహన సమన్వయం అవసరమని వివరించారు.

ఇదే సందర్భంగా మేజర్ జనరల్ శివకుమార్ శర్మ (రిటైర్డ్) ను భారత్ టిబెట్ సహయోగ్ మంచ్ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు.

రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రత, పర్యావరణ పరిరక్షణ, విధాన రూపకల్పనపై విస్తృత చర్చలు జరిగాయి. సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించడం, అవగాహన కార్యక్రమాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై సామూహిక సంకల్పంతో సమావేశం ముగిసింది.