News

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

23views

ఉగ్రవాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ -SCO రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈసందర్భంగా గతేడాది జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రస్తావించారు. ఈ ఘటన యావత్‌ మానవాళిని కుదిపేసిందన్నారు. దీని అనంతరం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టి.. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తప్పించుకోలేరని భారత్‌ నిరూపించిందన్నారు. ఉగ్రవాదమే ప్రపంచానికి ప్రధాన ముప్పుగా మారిందని వ్యాఖ్యానించారు. తీవ్రవాదం, ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఈసందర్భంగా పాకిస్థాన్‌ పేరు ప్రస్తావించకుండా.. ప్రభుత్వ మద్దతుతో జరిగే సీమాంతర ఉగ్ర దాడులను అస్సలు విస్మరించకూడదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. ఉగ్రవాదులకు సాయపడుతూ, ఆశ్రయం కల్పించేవారిపై చర్యలు తీసుకోవడంలో ఎస్‌సీఓ వెనకాడకూడదని ఆయన పిలుపునిచ్చారు.

ఈసందర్భంగా ప్రస్తుతం కొనసాగుతోన్న సంక్షోభం గురించి కూడా ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లుగా జరిగిన వరుస ఘర్షణల్లో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లిందన్నారు. ఉగ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈక్రమంలో ఉద్రిక్తతల పరిష్కారానికి దౌత్య మార్గాలను అనుసరించాలన్నారు.