
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధర్మదాయ ప్రణాళికలు చేపట్టాలి తప్ప కార్పొరేట్ తరహాలో దేవుడి పేరిట దేవాదాయ అజెండా చేపట్టడం సరికాదని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరుడు విశ్వవ్యాప్త ఆరాధకుడని అందరికీ ఒకే రకంగా ప్రవేశ రుసుం, పూజా టికెట్లు, వ్రత నియమాలు ఉండాలన్నారు. వంద రూపాయల రాహు కేతు పూజలకు నాగ పడగలు అవసరం లేదని తీర్మానించడం విచిత్రంగా ఉందన్నారు. 500 రూపాయల టిక్కెట్ రద్దు చేసి పెంచడం, మరల ఉందని పేర్కొనడం వంటి నిర్ణయాలు భక్తులను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు.
వెండి పడగలు లేకుండా చేసే రాహు కేతు పూజలు బావిలోకి చేద లేకుండా తాడు వదిలే ప్రక్రియలాంటి దన్నారు. ముఖ్యంగా ఆలయంలో అవినీతి నియంత్రణ చేయడానికి ఫిర్యాదు బాక్సులు, సీసీ కెమెరాల ఏర్పాటుచేసి, ప్రత్యేక వాట్సాప్ నంబర్ తో ఫిర్యాదుల విచారణ జరగాలన్నారు. సెక్యూరిటీగా పనిచేస్తున్న సిబ్బందికి కేవలం నెలకు 8 వేల రూపాయల వేతనం ఇవ్వడం దారుణంగా ఉందన్నారు. భక్త కన్నప్పకు కొండ మీద తొలిపూజ అభిషేకం చేసి వాయులింగేశ్వరుని పూజలు కొనసాగించే సనాతన సంస్కృతి సంప్రదాయాన్ని తిరిగి ఆచరణలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.



