ArticlesNews

ఆధునిక కాలపు అత్యవసరం – పంచ పరివర్తన జీవన సూత్రాలు

73views

శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిన్నటి ఆవిష్కరణ నేడు పాతబడి పోతున్నది. నేటి సాంకేతికత రేపటి మార్పునకు పునాది అవుతున్నది. నిత్య మార్పులను ఆకళింపు చేసుకుంటూ ప్రయాణం చేయవలసిన అగత్యం ఏర్పడింది. నిత్యం అప్‌డేట్‌ ‌కాకపోతే అవుట్‌డేట్‌ ‌కావలసి వస్తున్నది. మారుతున్న శాస్త్ర సాంకేతిక విప్లవంతో మానవాళి జీవితాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. భూమి కుగ్రామం అయిపోయింది. దూరాలు కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. దేశ సరిహద్దులు రేఖలుగా మిగిలిపోతున్నాయి. స్మార్ట్ ‌తెరలపై కొనవేళ్లతో తాకుతూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. డిజిటల్‌ ‌మానవుడి జీవనశైలిలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. తినే తిండి నుండి ఆర్థిక లావాదేవీల వరకు అన్నీ డిజిటల్‌ ‌మయం అవుతున్నాయి. అతి సుఖానికి, అత్యాశల సంపాదనకు మరిగిన మనిషిలో స్వార్థం పెరిగిపోతున్నది. నేటి దురాశతో రేపటి ఆరోగ్యకర పర్యావరణంతో రణం చేస్తున్నాడు. మానవ విలువలు, కుటుంబ పునాదులు కదులు తున్నాయి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు అంతరించి న్యూక్లియర్‌ ‌ఫ్యామిలీలు వెలుస్తున్నాయి. నాటి నాగరికత, మానవీయ విలువలతో కూడిన పౌర సమాజం నేడు విధ్వంసం వైపు వేగంగా పరుగిడుతున్నది.

పంచ పరివర్తన్‌ – ఐదు సానుకూల మార్పులు
ఈ ప్రతికూల మార్పులకు అడ్డుకట్ట వేయాల్సిన అగత్యం ఏర్పడిందని గమనించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సంస్థ తన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐదు ప్రధాన అంశాలను ‘‘పంచ పరివర్తన్‌ (ఐదు సానుకూల మార్పులు)’’ అనే పేరుతో గుర్తించి విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా గుర్తించిన ఐదు సమస్యలపై పోరాడి పునరుద్ధరించడానికి తగు ప్రజా చైతన్యం కల్పిస్తున్నారు. పంచ పరివర్తన్‌ ‌సూత్రాలు నేడు ప్రపంచ మానవాళి, ముఖ్యంగా భారతీయ సమాజానికి అత్యవసరం అని గమనించాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గుర్తించి చేపట్టిన ఐదు (సకారాత్మక) మార్పుల్లో పర్యావరణ పరిరక్షణ, కుటుంబ (ప్రబోధన్‌) ‌విలువల పునరుద్ధరణ, సమరసత లేదా హిందుస్థాన్‌లో సమైక్యత సాధన, స్వదేశీ ఉద్యమం, పౌర విధుల నిర్వహణ అనే అంశాలు ఉన్నాయి.

1. పర్యావరణ పరిరక్షణ
దినదినం పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతున్నది. ప్రకృతి విధ్వంసం జరుగుతున్నది. పీల్చే గాలి గరళం అవుతున్నది. తాగే నీరు విషతుల్యం అవుతున్నది. నడిచే నేల ఎడారిగా, కాలుష్యాల కుప్పలుగా మారుతున్నది. అభివృద్ధి పేరుతో పర్యావరణం విధ్వంసం అవుతున్నది. మానవ ఆధునిక జీవనశైలితో కాలుష్యం కోరలు చాస్తున్నది. నేడు కావలసినది కేవలం అభివృద్ధి కాదు, సుస్థిరాభివృద్ధి కావాలనే నినాదాలు హోరెత్తు తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడిన అభివృద్ధి కావాలని గుర్తిస్తున్నాం. రేపటి తరం ఆరోగ్యంగా బతకడానికి నేడు పర్యావరణ పరిరక్షణకు బీజాలు పడాలి. తాత్కాలిక లాభాలకు లొంగి శాశ్వత వినాశనం కోరుకోరాదు. ప్లాస్టిక్‌ ‌వాడకం భూగోళాన్ని సంక్షోభంలోకి నెడుతున్నది. ఓజోన్‌ ‌పొర పలుచన అవుతున్నది. అడవులు, హరిత క్షేత్రాలు అదృశ్యం అవుతున్నాయి. భూతాపం భయపెడుతున్నది. కార్బన్‌ ఉద్గారాలు ప్రజారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. సారవంతమైన నేలలు నిస్సార ఎడారులుగా మారిపోతున్నాయి. నేడు మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. మన బొందను మనమే తవ్వుకుంటున్నాం. వ్యవసాయంలో ప్రమాదకర రసాయనాలు, క్రిమిసంహారక మందులు విచక్షణారహితంగా వాడుతూ, రేపటి ప్రమాదానికి నేడు బీజాలు వేస్తున్నాం. తినే ఆహారం విషతుల్యం అవుతున్నది. ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నది. మన జీవనశైలిలో స్వల్ప మార్పులతో పర్యావరణ పరిరక్షణకు పట్టం కట్టడం నేటి అత్యవసర కార్యంగా గుర్తించాలి. శిలాజ ఇంధనాలకు బదులు తరగని సాంప్రదాయేతర ఇంధనాలను వాడాలి. ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. జల సంరక్షణకు కంకణబద్దులం కావాలి. మొక్కలు నాటడంతో పాటు అడవులను కాపాడుకోవాలి. ప్రకృతిని దేవతగా పూజించే పౌర సమాజం దానిని సంరక్షించుకోవాలి. రేపటి సమాజానికి సంపద, ఆస్తులతో పాటు ఆరోగ్యకర వాతావరణాన్ని బహుమతిగా ఇవ్వాలి. స్వచ్ఛమైన పర్యావరణం లేని పక్షంలో మన సంపాదన అనుభవించే ఆరోగ్యకర కుటుంబాలు ఉండవు. పర్యావరణ పరిరక్షణ దిశగా పటిష్ట అడుగులు వేయాలి. నాటి సహజ ప్రకృతిని నేడు తిరిగి పునఃప్రతిష్టించాలి.

2. విలువలతో కూడిన కుటుంబ (ప్రబోధన్‌) ‌వ్యవస్థ
భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఉమ్మడి కుటుంబాలు ప్రేమతో కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకుంటాయి. నేడు చిట్టి కుటుంబాలు, సహజీవన సంసారాలు, డేటింగ్‌ ‌సంస్కృతులు, సిచువేషన్‌షిప్‌ ‌రిలేషన్స్ ‌లాంటి విపరీత (అక్రమ) సంబంధాలు సర్వసాధారణం అయిపోయి విలువల పతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి వరదలో నేటి యువత కొట్టుకుపోతున్నారు. ప్రేమ, వాత్సల్యాలకు కొత్త నిర్వచనాలు పుట్టుకు వచ్చాయి. పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. మామిడి తోరణాలు వాడక ముందే విడాకుల విపరీతాలు సంభవిస్తు న్నాయి. మంగళసూత్రం అప్పుడప్పుడు వాడుకునే అలంకార ఆభరణం అయ్యింది. భార్యాభర్తలు, తోబుట్టువులు మధ్య హింసాత్మక ధోరణులు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు సంతానానికి భారమైపోతున్నారు. కలిసి భోజనం చేయడం అరుదైపోతున్నది. అనురాగం, ఆప్యాయత, త్యాగం, మమతానుబంధాలు పలుచబడుతున్నాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధంగా కొత్త కొత్త, పొట్టి పొట్టి వేషధారణలు ఫ్యాషన్‌ అయిపోయాయి. మన వాతావరణానికి తగిన దుస్తులకు బదులు ప్రతికూల ప్రభావం చూపే పరాయి దేశాల వస్త్రాలకు గిరాకీ పెరుగుతోంది. మాతృభాష పలకడం అవమానకరం అన్న భావనలు మొలుస్తున్నాయి. మన నగరాలు/పల్లెలు కాంక్రీట్‌ ‌జంగిల్స్ అయ్యాయి. మన గృహాలు అనారోగ్య సంబంధాలకు హేతువులుగా మారాయి. మనం నివసిస్తున్న గృహాలను ఆనందభవనాలు, శాంతి నివాసాలు అనే బదులు నేడు అశాంతి నెలవులు అనే దుస్థితి దాపురించింది. ఇంట్లో ప్రశాంతత, నిర్మలత్వం, పవిత్రత కరువైపోతున్నాయి. నాడు ఇంటిని స్వర్గంగా భావించాం. నేడు ఇంటిని విరామ (లాడ్జింగ్‌) ‌కేంద్రంగా మార్చేసాం. నాడు ఇంటి గోడలను ప్రేమల ఇటుకలతో కట్టుకున్నాం. నేడు షరతులతో కూడిన గోడలు కట్టుకుంటున్నాం. బాధ్యత, త్యాగాలను మరిచి పోతున్నాం.

3. సమైక్యత – సమరసత
కులమతాల అడ్డుగోడలతో పౌర సమాజం విచ్ఛిన్నం అవుతున్నాయి. హింసాత్మక ధోరణులు పెరుగుతున్నాయి. కులం, మతం ముందు మానవత్వం వెలవెలబోతున్నది. హిందూస్థాన్‌లో జీవిస్తున్న జనాభా సంఘటితం కావాలనే ఉద్యమం చేపట్టాలి. కులమతాలకు అతీతంగా ఏకం కావలసిన అగత్యం ఏర్పడింది. శాంతియుత సమైక్య పౌర సమాజం పునర్‌-‌నిర్మాణం జరగాలి. ఆరు ముఖ్య మతాలు, 3000లకు పైగా కులాలు, 25,000 వరకు ఉపకులాలు ఉన్న హిందూ భారతం నేడు సమైక్య శక్తిగా ఎదగాలి. బడుగు, బలహీన వర్గాలు, బలమైన అగ్ర వర్గాలు కాకుండా బాధ్యతగల పౌర వర్గాలుగా పునరేకీకరణ కావాలి. అంటరానితనం అంతం కావాలి. కులం పేరుతో పాతాళంలోకి కూరుకు పోరాదు.మతం పేరుతో మానవత్వం మరువరాదు. అందరం కలిసిమెలిసి కదం తొక్కాలి. ప్రపంచానికి సమైక్య భారతీయ సమాజం దారి దీపం కావాలి. సమరసత భావనలను సమాజంలోకి విస్తరించడానికి విహెచ్‌పి చేస్తున్న కృషి శ్లాఘనీయం. ఉన్నవాడు, లేనివాడు, అగ్ర, నిమ్న వర్గాలు లాంటి పదాలకు తావులేకుండా మేధావులు, శ్రమజీవులు అనే పదాలకు కట్టుబడి ఉండాలి. కులమతాల విభేదాలకు ఆజ్యం పోస్తున్న దేశద్రోహులను ఏరి పారేయాలి, పాతరేయాలి.

4. స్వదేశీ
డిజిటల్‌ ‌ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. భారత్‌ ‌సుస్థిరాభి వృద్ధిలో దూసుకుపోతున్నది. విదేశీ సంబంధాలు పటిష్టం అవుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి విదేశీ దిగుమతు లను తగ్గించడం, ఎగుమతులను పెంచడం జరగాలి. దిగుమతులను తగ్గించడానికి స్వదేశీ వస్తువుల ఉత్పత్తి, వినియోగం పెరగాలి. భారతీయ ఉత్పత్తు లను అక్కున చేర్చుకోవాలి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలి. యువభారతం నైపుణ్య విద్య కలిగిన మహోన్నత శక్తిగా ఎదగాలి. దేశీయ వస్తు సేవలకు పట్టం కట్టాలి. స్వదేశీ దుస్తులు, ఆహార ఉత్పత్తులు, గృహ నిర్మాణాలు, నిత్య అవసరాలను తయారు చేసే కేంద్రంగా భారత్‌ ‌కొత్తపుంతలు తొక్కాలి. విదేశీ వస్తు దిగుమతుల వరదలకు అడ్డుకట్ట పడాలంటే ప్రత్యామ్నాయ స్వదేశీ వస్తు ఉత్పత్తులు, వినియోగం విరివిగా జరగాలి. నేటి మన యువత రేపటి టెక్నోక్రాట్లు, సైంటిస్టులు, ఇన్నొవేటర్స్, ‌క్రియేటర్స్, ఎం‌టర్‌‌ప్రూనర్స్, ‌బిజినెస్‌మెన్‌, ‌ట్రేడ్స్‌మెన్‌, ‌రీసెర్చర్స్ ‌కావాలి. భారతదేశం విదేశాలను ఆదర్శంగా నిలవాలి.

5. పౌర విధులు – బాధ్యత కలిగిన పౌర సమాజం
భారత రాజ్యాంగం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇవ్వడం జరిగింది. హక్కులు అనుభవించే పౌరులు బాధ్యతలు కూడా భుజాన వేసుకోవాలి. పౌర విధులు తూచా తప్పకుండా పాటించాలి. స్వీయ క్రమశిక్షణ మన శాశ్వత ఆభరణం కావాలి. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. పౌర నియమనిబంధనలను పాటించడం మరువరాదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి. పన్నులను విధిగా చెల్లించాలి. మన విధులను మనస్ఫూర్తిగా నిర్వహించాలి. అక్రమాలు, అవినీతి, లంచగొండితనాలకు తావులేని భారతం నిర్మితం కావాలి. క్రమశిక్షణ కలిగిన సైనికుల వలె మన జీవనశైలి క్రమబద్దం కావాలి. రోడ్డు నియమాలు పాటించాలి. జాతీయ ఆదాయానికి దోహదపడాలి. చట్టాలను గౌరవించాలి. నైతికతతో కూడిన రాజకీయ వ్యవస్థ కావాలి. ఉద్యోగులు తమ విధులకు కట్టుబడి ఉండాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. దేశ రక్షణ విషయంలో ప్రాణాలకు తెగించి ముందుకు రావాలి. జాతి సహజ వనరులపై దొంగ చూపు సారించే ప్రబుద్ధుల కళ్లు పీకేయాలి. మన గాలి, మన నీరు, మన నేల అనే నినాదం నిత్య మంత్రం కావాలి.

రాబోయే రోజుల్లో అగ్ర రాజ్యాల సరసన అభివృద్ధి చెందిన దేశంగా మనదేశం నిలువడానికి పంచ పరివర్తన్‌ ‌సూత్రాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. పర్యావరణాన్ని సంరక్షించుకుంటూ, కుటుంబ విలువలకు పట్టం కడుతూ, స్వదేశీ వస్తు వినియోగాలకు ఊతం ఇస్తూ, సమైక్యతకు పెద్ద పీట వేస్తూ, పౌర విధులకు ప్రాణం పోస్తూ ముందుకు సాగుతున్న భారతావనికి భవ్య భవిష్యత్తు నిక్కంగా కనిపిస్తున్నది. 1.47 బిలియన్ల భారత్‌ ‌జనాభా పంచ పరివర్తన్‌ ‌సూత్రాల పునాదులపై ఏకతాటిపై నిలిస్తే, మన ఎదుగుదల పరాయి దేశాలకు ఈర్ష్యజనకంగా, స్వదేశీయులకు గర్వకారణంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. జై జవాన్‌, ‌జై కిసాన్‌, ‌జై విద్వాన్‌, ‌జై అనుసంధాన్‌ !

డా. బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
9949700037