
ప్రకాశం జిల్లాలోని చారిత్రక సంపద కాలగర్భంలో కలిసిపోతోంది. చందవరంలోని బౌద్ధాస్తూపం.. సంతమాగులూరులోని వేణుగోపాలస్వామి ఆలయాలను పట్టించుకునేవారు కరవయ్యారు. సంతమాగులూరు మండలంలోని కుందుర్రు నుంచి పరిటాలవారిపాలెం వెళ్లే మార్గంలో రహదారిలో 16వ శతాబ్దం నాటి వేణుగోపాలస్వామి ఆలయం ధ్వంసమై కాలగర్భంలో కలిసిపోతోంది. అధికారులు, పురావస్తు శాఖ వారు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. అక్కడ తెలుగులో లిఖించిన శిలాశాసనం ధ్వంసమైపోతోంది. గుప్త నిధుల కోసం స్వార్థపరులు ఆలయంలోని మూలవిరాట్‌లను 15 ఏళ్ల క్రితం పెకలించుకుపోయారు. అప్పటి శిలాశాసనం, ఆలయం చుట్టూ తుమ్మచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి చారిత్రక సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
కామన్‌గుడ్ ఫండ్ సాయంతో..
దీనిపై చారిత్రక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ..16వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఓ వెలుగు వెలిగిన ఆలయమన్నారు. ఎన్నో విశిష్టతలు ఈ ఆలయం సొంతమన్నారు. ప్రాచీన తెలుగు శిలాశాసనాన్ని పరిరక్షించాలన్నారు. స్థానికులు సమష్టిగా కొంత భాగస్వామ్యం సమకూర్చుకుని ప్రభుత్వ పరంగా కామన్ గుడ్‌ఫండ్ (సీజీఎఫ్)ను సద్వినియోగం చేసుకుని జీర్ణోద్ధరణకు కృషి చేయాలన్నారు.





