
మరికొద్ది రోజుల్లో చార్‌ధామ్ యాత్ర తలుపులు తెరుచుకోనున్నాయి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను భక్తులు దర్శించుకునే అవకాశం దక్కనుంది. సంవత్సరంలో కొన్ని నెలల పాటు మాత్రమే తెరిచి ఉండే చార్‌ధామ్ యాత్ర చేయాలని హిందువులు కోరుకుంటుంటారు. ముఖ్యంగా యువత గ్రూపులుగా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో చార్‌ధామ్ యాత్ర ఎలా వెళ్లాలి? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలిపే కథనం ఇది.
అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ద్వారాలను తెరుస్తారు. దీంతో చార్‌ధామ్ తీర్థయాత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 22న కేదార్నాథ్, 23న బద్రీనాథ్ తలుపులు తెరుచుకుంటాయి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. యాత్రకు రెండు రోజుల ముందు రిషికేశ్, హరిద్వార్, డెహ్రాడూన్‌లో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు.
హిందూ సంప్రదాయం ప్రకారం చార్ ధామ్ యాత్రను పశ్చిమం నుంచి ప్రారంభించి తూర్పు వైపు పూర్తి చేయడం పవిత్రంగా భావిస్తారు. మొత్తం యాత్ర పూర్తి చేయడానికి 10 నుంచి 12 రోజుల సమయం పడుతుంది. ముందుగా యమునా నది జన్మస్థానమైన యమునోత్రిని సందర్శిస్తారు. ఆ తర్వాత గంగా నది జన్మస్థానమైన గంగోత్రి, ఆ తర్వాత జ్యోతిర్లింగ కేదార్నాథ్, చివరగా విష్ణుమూర్తి కొలువైన బద్రీనాథ్ సందర్శనతో యాత్ర సంపూర్ణం అవుతుంది.
రూట్ మ్యాప్
- దిల్లీ నుంచి హరిద్వార్ 210 కిలోమీటర్లు 6గంటల ప్రయాణం
- హరిద్వార్ నుంచి బార్కోట్ 220 కిలో మీటర్లు 7 గంటల ప్రయాణం
- బార్కోట్ నుంచి యమునోత్రి 36కిలోమీటర్లు, మరో 7కిలోమీటర్లు ట్రెక్కింగ్
- బార్కోట్ నుంచి ఉత్తరకాశీ 100కిలోమీటర్లు 4గంటల ప్రయాణం
- ఉత్తరకాశీ నుంచి గంగోత్రి 100కి.మీ., 4గంటల ప్రయాణం
- ఉత్తర కాశీ నుంచి రుద్రప్రయాగ 180కి.మీ. 8గంటల ప్రయాణం
- రుద్ర ప్రయాగ నుంచి కేదార్నాథ్ 74కి.మీ. మరో 20కి.మీ. ట్రెక్కింగ్
- రుద్ర ప్రయాగ నుంచి బద్రీనాథ్ 160కి.మీ. 7గంటల ప్రయాణం
- బద్రీనాథ్ నుంచి రిషీకేష్ 297కి.మీ. 11గంటల ప్రయాణం
- రిషీకేష్ నుంచి దిల్లీ 230కి.మీ. 6గంటల ప్రయాణం
జాగ్రత్తలు తప్పనిసరి :
- చార్‌ధామ్ యాత్రికులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
- హరిద్వార్, రిషికేశ్ సహా మొత్తం 50 ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
- యాత్రికులు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
ఇలా బుక్ చేసుకోవాలి :
- ముందుగా ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://registrationandtouristcare.uk.gov.in/ లోకి వెళ్లాలి.
- మొబైల్ నంబర్ ద్వారా లాగిన్/రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాతో సహా మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి.
- ఆధార్, ఓటరు కార్డు, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను అప్లోడ్ చేయాలి.
- మొబైల్ నంబర్‌కు పంపిన OTP ఎంటర్ చేయాలి.
- మీ టూర్‌ను తేదీలు, సమయాన్ని నమోదు చేసుకోవాలి.
- చివరగా యాత్ర ఇ-పాస్‌ను ప్రింట్ తీసుకోవాలి.





