
తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర బంగాల్ అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అదే క్రమంలో మదర్సాలకు సుమారు రూ. 6,000 కోట్లు కేటాయించారని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల కనీస అవసరాలను విస్మరించి, బుజ్జగింపు రాజకీయాల్లో బిజీగా ఉందన్నారు. ఈశాన్య భారతాన్ని దేశాన్ని కలిపే వ్యూహాత్మకమైన సిలిగుఢి కారిడార్‌ను విడదీస్తామని ‘తుక్డే-తుక్డే’ ముఠా బెదిరిస్తోందన్నారు. అలాంటి వారికి TMC తన బుజ్జగింపు రాజకీయాల కోసం వీధుల్లో నుంచి పార్లమెంటు వరకు మద్దతు ఇచ్చిందని ప్రధాని ఆరోపించారు. ఉత్తర బంగాల్ నగరమైన సిలిగుఢిలోని కవాఖాలి మైదానంలో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించారు. ఈశాన్య ప్రాంతానికి ముఖద్వారంగా నిలిచే ఈ కారిడార్‌ను భారీ ఎత్తున అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
“దేశంలో ఒక ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ ఉంది. అది సిలిగుఢి కారిడార్‌ను దేశం నుంచి విడదీస్తామని బెదిరిస్తోంది. వారు ఈశాన్య ప్రాంతాన్ని దేశం నుంచి వేరు చేయాలని కోరుకున్నారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే TMC, అటువంటి వ్యక్తులకు వీధుల నుంచి పార్లమెంటు వరకు మద్దతు ఇస్తోంది. అదే TMC యొక్క నిజస్వరూపం. బీజేపీ దృష్టిలో సిలిగుఢి కారిడార్ అనేది దేశం, భద్రత, సమృద్ధికి సంబంధించిన ఒక కీలక మార్గం. ఈ ప్రాజెక్టు బంగాల్, సిక్కింలో రవాణా అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని, పర్యాటకాన్ని భారీగా పెంపొందిస్తుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి ప్రాజెక్టుకు TMC అడ్డుపడుతోంది. ఉత్తర బంగాల్ పట్ల చూపుతున్న వివక్షకు TMC ప్రభుత్వ బడ్జెట్ ఒక నిదర్శనం. ఈ క్రూరమైన ప్రభుత్వం మదర్సాల కోసం సుమారు రూ. 6,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. కానీ ఉత్తర బంగాల్‌లోని ఇంత విశాలమైన ప్రాంతం అభివృద్ధికి మాత్రం తగినంత బడ్జెట్‌ను కేటాయించడం లేదు. TMC పగలు, రాత్రి తేడా లేకుండా తన సొంత ప్రత్యేక ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడంలోనే నిమగ్నమై ఉంది. ఉత్తర బంగాల్‌లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాల బీభత్సంతో అంతటా అల్లకల్లోలం నెలకొంది. ఆ సమయంలో ఈ TMC ప్రభుత్వం కోల్‌కతాలో సంబరాలు చేసుకుంటోంది. TMC అనేది ఉత్తర బంగాల్ వ్యతిరేక పార్టీ.”
—నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
TMC 15 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసిందని, కేంద్ర పథకాల అమలును అడ్డుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. దీని ఫలితంగా 25 శాతంలోపు పనులు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. TMC గిరిజన, మహిళా, యువజన వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. ఈ క్రమంలోనే ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన మోదీ, బంగాల్ రెట్టింపు వేగంతో అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. బంగాల్ ప్రజల్లో తాను గమనిస్తున్న ఉత్సాహాన్ని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో TMC ఓటమి ఖాయమని తనకు నమ్మకం కలిగిందన్నారు.
“బంగాల్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించాను. అక్కడ యువత, తల్లులు, సోదరీమణులు, వృద్ధులు, గ్రామస్థుల్లో నేను చూసిన ఉత్సాహం, శక్తి, ఆవేశం నిజంగా అద్భుతం. ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, మైళ్లు తరబడి నడిచి అక్కడికి వచ్చారు. బంగాల్ ఇప్పుడు మార్పు కోసం దృఢంగా నిశ్చయించుకుంది. ఈసారి TMC అధికారం కోల్పోవడం ఖాయం. మే 4వ తేదీ తర్వాత, బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు గత 15 ఏళ్లలో గడిపిన ప్రతి క్షణానికి మీరు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ప్రతి పైసాకు మీరు జవాబుదారీగా ఉండాలి.” అని ప్రధాని మోదీ అన్నారు. బంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఏప్రిల్ 23న మొదటి దశ, ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. కాగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.





