అర్ధ శతాబ్దం తర్వాత మానవుడిని మళ్లీ చంద్రుడి వైపు తీసుకెళ్లే ప్రతిష్టాత్మక ప్రయోగం ఆర్టెమిస్-2. ఆ మహత్తర మిషన్ విజయవంతం కావడం వెనుక ఒక భారతీయ సంతతి శాస్త్రవేత్త మేధస్సు కీలక పాత్ర పోషించడం విశేషం. నాసాలో అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న అమిత్ క్షత్రియ ఈ మిషన్‌కు ప్రధాన సూత్రధారిగా నిలిచారు. అమెరికాలోని విస్కాన్సిన్లో జన్మించిన అమిత్ క్షత్రియ చిన్నప్పటి నుంచే అంతరిక్షంపై అపారమైన ఆసక్తి పెంచుకున్నారు. హ్యూస్టన్ నగర పరిసరాల్లో పెరిగిన ఆయన, అక్కడి జాన్సన్ స్పేస్ సెంటర్‌లో జరిగే రాకెట్ ప్రయోగాలను చూసి ప్రేరణ పొందారు. చిన్ననాటి ఆ ఆసక్తే ఆయనను నాసా అగ్రస్థాయికి చేర్చింది.
పలు విభాగాల్లో కీలక బాధ్యతలు
విద్యాభ్యాస పరంగా కూడా అమిత్ ప్రతిభ కనబరిచారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గణితశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో మాస్టర్స్ చేశారు. మొదట్లో చమురు, గ్యాస్ రంగాల్లో పనిచేసినప్పటికీ, అంతరిక్షంపై ఉన్న మక్కువతో ఆ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. 2003లో నాసా కాంట్రాక్టర్ సంస్థ యునైటెడ్ స్పేస్ అలయన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించారు. అక్కడి నుంచి క్రమంగా ఎదుగుతూ రోబోటిక్స్, స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో రోబోటిక్ అసెంబ్లీ విభాగంలో ఆయన చేసిన సేవలు విశేషంగా నిలిచాయి.
2014 నుంచి 2017 వరకు స్పేస్ స్టేషన్ ఫ్లైట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అమిత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బృందాలను సమన్వయం చేస్తూ అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా నడిపించారు. తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన వాహన విభాగంలో డిప్యూటీ, యాక్టింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ కాలంలో ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, హార్డ్‌వేర్ నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2021లో నాసా ప్రధాన కార్యాలయానికి బదిలీ అయిన అమిత్, ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ మిషన్ డైరెక్టరేట్‌లో కీలక పాత్ర పోషించారు. మానవులను చంద్రుడికి తీసుకెళ్లే స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఆయన సంస్థలో అత్యున్నత సివిల్ సర్వెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాసా అడ్మినిస్ట్రేటర్‌కు సీనియర్ సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు.
ఆర్టెమిస్-2 మిషన్‌లో అమిత్ వ్యూహాలు కీలకం
నాసాలోని 10 ప్రధాన కేంద్రాల డైరెక్టర్లను సమన్వయం చేయడం, సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించడం ఆయన బాధ్యతల్లో భాగం. ముఖ్యంగా మూన్ టు మార్స్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహిస్తూ చంద్రుడిపై స్థిర నివాస ఏర్పాటుతో పాటు, భవిష్యత్తులో అంగారక గ్రహానికి మానవ యాత్రలకు మార్గం సుగమం చేస్తున్నారు. ఇటీవల విజయవంతంగా ముగిసిన ఆర్టెమిస్-2 మిషన్‌లో అమిత్ వ్యూహాలు కీలకంగా మారాయి. ఆ మిషన్ ద్వారా వ్యోమగాములను చంద్రుని కక్ష్యలోకి పంపి, భూమికి సురక్షితంగా తీసుకురావడంలో నాసా విజయం సాధించింది. ఈ విజయంపై స్పందించిన అమిత్ క్షత్రియ “చంద్రుడి వైపు వెళ్లే మార్గం ఇప్పుడు మరింత స్పష్టమైంది. అయితే మన ముందున్న లక్ష్యాలు ఇంకా పెద్దవే. ఈ విజయానికి వేలాది మంది కృషి కారణం” అని పేర్కొన్నారు.

ఆర్టెమిస్ 2 సిబ్బంది (AP)
వ్యోమగాముల భద్రతపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఉన్న ప్రమాదాలను గుర్తుంచుకుంటూనే సురక్షితంగా మిషన్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టామని తెలిపారు. ఈ మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ధైర్యంతో ఎదురుచూశారని అన్నారు. ముఖ్యంగా భూమికి తిరిగి వచ్చే ఆ కీలక క్షణాల్లో కుటుంబ సభ్యుల ఆందోళన, ఆశలు ఎంతో భావోద్వేగభరితంగా నిలిచాయని చెప్పారు. అమిత్ క్షత్రియ ప్రతిభకు గుర్తింపుగా నాసా అనేక పురస్కారాలు ప్రదానం చేసింది. స్పేస్ స్టేషన్ 50వ ఎక్స్‌పెడిషన్‌లో ఆయన చూపిన నాయకత్వానికి అవుట్‌స్టాండింగ్ లీడర్‌షిప్ మెడల్ లభించింది. అలాగే వ్యోమగాములు అత్యంత గౌరవంగా భావించే సిల్వర్ స్నూపీ అవార్డు కూడా ఆయన అందుకున్నారు. చిన్ననాటి కలలను నిజం చేసుకుంటూ అంతరిక్ష రంగంలో అగ్రస్థానానికి చేరుకున్న అమిత్ క్షత్రియ. భారతీయుల ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. ఆర్టెమిస్-2 విజయంతో చంద్రయానం కొత్త దశలోకి అడుగుపెట్టగా భవిష్యత్తులో మరింత భారీ లక్ష్యాలను సాధించేందుకు నాసా సిద్ధమవుతోంది.





