News

బాసర ఆలయ పునరాభివృద్ధికి రూ.225 కోట్లు

75views

బాసరలోని ప్రసిద్ధ శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం, చుట్టుపక్కల అభివృద్ధి పనులను రూ.225 కోట్లతో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్‌ శనివారం ఉత్తర్వులు (జీవో 191) జారీ చేశారు. ఈ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి 6వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. అమ్మవారి ఆలయానికి నిత్యం వేల మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. అక్షరాభ్యాసాలతోనూ ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. వసంత పంచమి, ఇతర పవిత్రరోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా తరలివస్తుంటారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు బాసర క్షేత్రానికి లక్షల సంఖ్యలో వస్తారని అంచనా. ప్రస్తుతం దేవాలయ ప్రాంగణం ఇరుకుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌ సౌకర్యం లేదు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. సమావేశంలో బాసర మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ.. దశలవారీగా అభివృద్ధి చేయాలని సూచించారు. దీంతో దేవాదాయశాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.372 కోట్లు కాగా తాజాగా రూ.225 కోట్లకు అనుమతి ఇచ్చారు.

మాడ వీధుల నిర్మాణం

దేవాలయ ప్రాంగణం గర్భాలయం, అర్ధమండపాన్ని ఇప్పుడున్నదాని కంటే రెండున్నర రెట్లు పెంచనున్నారు. 2 వేల చదరపు అడుగుల నుంచి 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెరగనుంది. దేవాలయ ప్రాంగణం 20 వేల చ.అ. నుంచి 60 వేల చ.అ.కు పెరుగుతుంది. ఉత్తరాన 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అంతస్తుల్లో రాజగోపురాలు నిర్మించనున్నట్లు సమాచారం. 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల్లో మాడ వీధుల్ని నిర్మిస్తారు. శిలా నిర్మాణాలే ఉంటాయి.

  • 70 వేల చ.అ.తో ఆరు వేల మంది భక్తులకు సరిపడా అన్ని వసతులతో క్యూకాంప్లెక్స్‌ నిర్మాణం ..టాయిలెట్లు, ఫీడింగ్‌ రూమ్‌లు, ఫుడ్‌స్టాళ్ల ఏర్పాటు
  • 200 మంది కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా మందిరం
  • 20 వేల చ.అ. విస్తీర్ణంలో ప్రసాద పంపిణీ కేంద్రం, వంటశాల, భోజనశాల
  • బాసర ఆలయ పునరాభివృద్ధి ప్రధాన పనులు ఇలా..

  • పార్ట్‌-ఏ : ప్రధాన ఆలయం పునరాభివృద్ధి, అనివేత్తి, ప్రాకార మండపాలు, రాజగోపురం, యాగశాల మొదలైనవి
  • పార్ట్‌-బి : బిల్డింగ్‌ పనులు..ఇందులో క్యూ కాంప్లెక్స్, సమాచార కేంద్రం, ప్రసాదం కిచెన్, అతిథిగృహం, పోలీస్‌స్టేషన్, గోశాల, మెడిటేషన్‌ హాల్, టాయిలెట్‌ బ్లాక్‌లు, అనుస్థాన మండపం, అర్చక క్వార్టర్, వ్యాసగృహ మండపం విస్తరణ పనులు.
  • పార్ట్‌-సి: రహదారి పనులు.. కొత్త రోడ్డు నిర్మాణం, గాబియన్‌ వాల్స్‌
  • పార్ట్‌-డి: ప్రొటెక్షన్‌ పనులు.. రిటైనింగ్‌ వాల్, స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌
  • పార్ట్‌-ఈ: ల్యాండ్‌స్కేప్‌ సుందరీకరణ..తోరణాలు, ఆలయ ప్రవేశద్వారం, కోనేరు నిర్మాణం, గ్రాండ్‌ నార్త్‌ ఎంట్రన్స్, సోలార్‌ పార్కింగ్‌..
  • గోదావరి ఘాట్‌ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి