
జిహాద్ కోసం తాము ప్రాణాలకు తెగించి దేనికైనా సిద్ధపడ్డామని విజయవాడ ఉగ్రమూలాలున్న కేసులో నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. ఏక్యూఐఎస్, ఐసిస్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వీరు అంగీకరించినట్లు సమాచారం. కొన్నిరోజులు ఆగి ఉంటే, తాము జిహాదీ శిక్షణ నిమిత్తం పాకిస్థాన్ వెళ్లే వాళ్లమని చెప్పినట్లు సమాచారం. ఐదురోజుల కస్టడీలో భాగంగా రహంతుల్లా షరీఫ్, మహ్మద్ డానిష్, మీర్జా సొహైల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలామ్‌ను పోలీసులు, సీఐ సెల్ అధికారులు విచారించారు. ఇంటరాగేషన్‌లో వీరి స్టేట్‌మెంట్లను పోలీసులు రాసుకున్నారు.
ఏక్యూఐఎస్, ఐసిస్‌తో సంబంధాలు : జిహాద్ కోసం సన్నాహకంగా విజయవాడకు చెందిన రహంతుల్లా, సొహైల్, డానిష్‌లు కలసి ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో ఒక గ్రూపును ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు లోతుగా ప్రశ్నించారు. అందులోభాగంగా ఏక్యూఐఎస్, ఐసిస్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వీరు అంగీకరించినట్లు సమాచారం. వీరు శిక్షణ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేందుకూ సిద్ధపడినట్లు వెల్లడించారు. షుకూర్ ప్రసంగాలు తమను ఈ దిశగా ప్రేరేపించాయని ఈ ముగ్గురు వివరించారు. ఇజ్రాయెల్ వస్తువులు వాడొద్దంటూ అన్ని ముస్లిం దుకాణాల వద్ద పోస్టర్లు అంటించి, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశామని చెప్పినట్లు సమాచారం.
వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డాం : తన భర్త మరణించాడని, ఈ నేపథ్యంలో తోడు కోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషిస్తున్న సమయంలో జిహాదీ భావజాలం ఉన్న కొందరు పరిచయమయ్యారని హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రయత్నంలో తనకు ఒకరు పరిచయం అయ్యాడని, వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డామని కానీ అతనికి వయసు ఎక్కువగా ఉండడంతో మనసు మార్చుకున్నానని చెప్పింది. ఇలా తాను ఈ ఉచ్చులో చిక్కుకున్నానని ఆమె వివరించినట్లు సమాచారం.
జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ : ఈ కేసు త్వరలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చేతికి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ కేసును విజయవాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారిగా నగర పశ్చిమ ఏసీపీ దుర్గారావు వ్యవహరిస్తున్నారు. ఐదుగురు నిందితుల కస్టడీ నేడు(ఆదివారం)తో ముగియనుంది. మిగిలిన నిందితులు షాద్‌మాన్ దిల్‌కుష్, లక్కీ అహ్మద్, జీషాన్, మీర్ అసిఫ్ అలీ, షారుఖ్ ఖాన్, ఫయాజ్ ఉర్ రెహ్మాన్ కస్టడీ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణకు రానుంది. వీరి కస్టడీతో పాటు హోమ్‌లో ఉన్న మైనర్‌ను కూడా పోలీసులు ప్రశ్నించిన అనంతరం కేసును నగర పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేయనున్నారు.





