
( మార్చి 29 – మలయాళ స్వామి జయంతి )
అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మలయాళ స్వామి, స్త్రీలు కూడా దీక్షలు తీసుకోవచ్చని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని. మలయాళ స్వామి తల్లిదండ్రులు కరియప్ప, నొత్తియమ్మ. కేరళలోని తిరువాయూర్ సమీపంలో 1885 మార్చి 29న జన్మించారు. చిన్న వయసులో ఈయనకు వేళప్ప అని పేరు పెట్టారు. చిన్ననాటినుండే భగవత్‌పూజ, భజన, ధ్యానం వేలప్ప నిత్యకృత్యాలు. చదువులో ముందుండేవాడు. వేళప్ప శ్రీ నారాయణగురు శిష్యుడైన శ్రీ శివ లింగస్వామి పెరింగోట్కర గ్రామంలో ప్రారంభించిన శ్రీ నారాయణ ఆశ్రమంలో విద్యార్జన కోసం చేరాడు. అనేక ఆధ్యాత్మిక విద్యలను పొంది శివలింగ గురుస్వామి వద్ద మంత్రోపదేశం పొందారు. శ్రీ నారాయణగురుదేవుని సందర్శించి వారి ఆశీర్వాదాలను పొందారు.
వేళప్ప తన 18వ ఏటనే కాలినడకన దేశమంతా పర్యటించారు. దేశం నలుమూలలలోని పుణ్యక్షేత్రాలన్నీ సందర్శిం చారు. బ్రహ్మకపాలతీర్ధం చేరిన వేళప్ప..లోకంలో సమస్త ప్రాణులు పరబ్రహ్మ గోత్రం నుండే ఉద్భవించాయి కనుక తాను వదిలే తర్పణం అన్ని ప్రాణులకు చెందాలంటూ తర్పణం వదిలారు. బుద్ధుని వలే ఆయన జీవకారుణ్య గుణం కలవాడని తెలియజేసేందుకు ఈ ఉదంతం ఒక్కటి చాలు.
వేళప్ప తన దేశవ్యాప్త పర్యటనలో పలు విషయాలను అధ్యయనం చేశారు. విద్యావిజ్ఞానాలు అందుబాటులో లేని కారణంగా చాలామంది ప్రజలు పశుప్రాయులుగా జీవిస్తున్నారని గుర్తించారు. గుణకర్మలపై ఆధారపడిన వర్ణవ్యవస్థ జన్మతో ముడివడిన కుల వ్యవస్థగా మారడాన్ని తప్పుబట్టారు. ప్రాచీనులు అందించిన వేద విజ్ఞానాన్ని ప్రజలందరికీ లౌకిక విద్యతోపాటు అందిస్తేనే స్వరాజ్యం సిద్ధిస్తుందని స్పష్టీకరించారు.
సృష్టిలోని సమస్త జీవరాశుల్లోకి మానవుడు శ్రేష్ఠమైన ప్రాణి. అందరి హృదయాల్లో భగవత్ స్వరూపం ఉంది. ‘నేనెవరిని?’ అని ప్రశ్న వేసుకుంటే ఇది కనిపిస్తుంది. అది శరీరంకన్నా భిన్నమైంది. దాన్ని దర్శించగలిగితే ప్రతి మనిషి సాటి మనిషిని ఎలాంటి వివక్ష లేకుండా ప్రేమించగలుగుతాడు. వేళప్ప తన జీవితాన్ని, తపస్సుని ఈ లక్ష్యం కోసమే వెచ్చించారు. తిరుమలలో ఏకాకిగా కట్టుబట్టలతో 12 సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేశారు. అక్కడే ఆయనను భక్తులు సద్గురు మలయాళ స్వామిగా పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత అదే పేరు ఆయనకు స్థిరపడింది.
తిరుమలలో తపస్సులో ఉండగానే స్త్రీలకు, శూద్రులకు, అశ్పృస్య వర్గాల ప్రజలకు అందరికి బ్రహ్మవిద్య పొందే అధికారం ఉందని తెలియజేస్తూ అందుకు ప్రమాణంగా ఉండే విధంగా 1919 డిసెంబరులో ‘శుష్క వేదాంతమో భాస్కరం’ అనే గ్రంథాన్ని రాశారు. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన తరువాత సామాజిక మార్పును సాధించేందుకు తిరుమల నుండి శిష్యులతో తిరుపతి – శ్రీకాళహస్తి మధ్యగల ఏర్పేడు కాశీబుగ్గకు 3 జూన్ 1926న చేరారు. అక్కడే వ్యాసాశ్రమం ప్రారంభమైంది.
మళయాళ స్వామి 1927లో ‘యదార్ధ భారతి’ అనే పత్రికను ప్రారంభించారు. తన ఆశయాల ప్రచారం కోసం భక్తులతో 1926లో ‘సనాతన ధర్మ పరిపాలన సేవా సమాజం’ అనే సంస్థను ప్రారంభిం చారు. ప్రతి సంవత్సరం వేదాంత సభలను పెద్ద సంఖ్యలో నిర్వహించారు. భగవద్గీత, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు… ఇలా సనాతన ధర్మ సందేశాన్ని కుల భేదాలకు తావులేకుండా అందరికి ఆనాడే అందించిన ధార్మిక విప్లవకారుడు సద్గురు మలయాళ స్వామి. 1937లో ఓంకార సత్రయాగం రాజమండ్రిలో ప్రారంభించి స్త్రీలతో పాటు అన్ని కులాలవారికి బోధలు చేశారు. 1945 ఒక స్త్రీకి సన్యాస దీక్షనిచ్చి చరిత్ర సృష్టించారు. వ్యాసాశ్రమంలో కొన్ని వందల సంఖ్యలో గ్రంథాలను ప్రచురించి ఆస్తిక జనాలకు అందించాడు. హిందూ సమాజంలో అనేక సంస్కరణలను చేసిన శ్రీ సద్గురు మళయాళ స్వామి 12 జులై 1962న మహాసమాధిని పొందారు. జనులందరిలో సమత్వ బుద్ధి సిద్ధించాలని, భగవంతుని ఆర్ధ్ర హృదయంతో వేడుకున్న స్వామీజీ ఆకాంక్షని మనందరం నెరవేర్చాలి. ఇదే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి.





