ArticlesNews

అమ్మకు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ

89views

( మార్చి 28 – జిల్లెళ్ళమూడి అమ్మ జయంతి )

పరిమిత ప్రేమ మానత్వం..అపరిమిత మమకారం మాధవత్వం..అని అందరికీ అర్థమయ్యేలా సరళంగా వివరించిన దయామయి జిల్లెళ్ళమూడి అమ్మ. నేను నా కుటుంబం, నా ఊరు బాగుంటే చాలు అనుకుంటే అది మానవత్వమే. మన పరిధి విస్తరించి లోకాస్సమస్తా సుఖినో భవంతు అని కోరుకుంటే అది మాధవత్వం. మానవులను మాధవులుగా తీర్చిదిద్దడమే అమ్మ ఆశ, ఆశయం. ఆ అవ్యాజ వాత్సల్య జలధి 1923 మార్చి 28న గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు అనసూయ. జల్లెళ్ళమూడి అమ్మకు తన 13వ ఏట ఆమె మేనత్త కనకమ్మగారి పెద్దకొడుకు బ్రహ్మాండం నాగేశ్వరరావుతో 1936 మే5న బాపట్లలో వివాహం జరిగింది. పుణ్యదంపతులు బాపట్లలో కాపురం పెట్టారు. నాలుగేళ్ల తర్వాత 1940లో జిల్లెళ్ళమూడికి చేరి అక్కడ కాపురమున్నారు.

1950లో ఒక సన్యాసిని ఆతిధ్యం స్వీకరించమని అమ్మ తన ఇంటికి ఆహ్వానించింది. దేవాలయంలేని ఊళ్లో భిక్ష స్వీకరించనని సన్యాసి చెప్పడంతో అమ్మ మనసు తల్లడిల్లి గ్రామంలో దేవాలయం, సత్రం ఏర్పాటు చేయాలని భావించింది. అందుకు పిడికెడు బియ్యం అనే పథకం ఏర్పాటు చేసింది. ఆ పథకం మంత్రంలా పని చేసి 1958 ఆగస్టులో అన్నపూర్ణాలయం పురుడు పోసుకుంది. ఆ సత్రంలో భోజనం చేయడానికి ఆకలే అర్హత. అన్ని బాధల కంటే ఆకలి బాధే ఎక్కువని అమ్మ అనేవారు. అమ్మ తన ఇంటిని అందరి ఇల్లు అని పేరు పెట్టారు.

చండీయాగం, రుద్రయాగంలా.. మాతృయాగం చేయమని తన భక్తులకు చెప్పేవారు జిల్లెళ్లమూడి అమ్మ. రోగులకు ఔషధసేవ, అన్నార్తులకు భోజనసేవ, వృద్ధులు, నిరాశ్రయులకు వస్త్రసేవ ఇలా త్రివిధ సేవ చేయడమే మాతృయాగం. దయకు నిదర్శనంగా అమ్మ నెలకొల్పిన ‘అందరిల్లు’లో ఎలాంటి తారతమ్యాలూ లేకుండా ఎవరు, ఏ సమయంలో ఎక్కడి నుంచి వచ్చినా అన్నంపెట్టి, ఆదరిస్తారు. ‘తినకపోతే మీరు చిక్కిపోతారు, పెట్టకపోతే నేను చిక్కిపోతాను’ అనేదామె. ‘డ్రెస్సు, అడ్రెస్సు కాదు.. ఇక్కడ భోజనం చేయడానికి ఆకలే అర్హత’, ‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా తినిపించు’ అనేవారు.

అమ్మ దివ్య ఆశీస్సులతో “మాతృశ్రీ విద్యా పరిషద్” 1971 ఆగస్టు 6న జిల్లెళ్ళమూడిలో ప్రారంభమైంది. పరిషద్ ఆధ్వర్యంలో అదే రోజున మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి ప్రారంభమైంది. కళాశాల ప్రారంభంలో కేవలం ముగ్గురు లెక్చరర్లు, 25 పిల్లలతో ప్రారంభించారు. నేడు, పరిషద్ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి, సంస్కృత పాఠశాలలను నడుపుతోంది. మాతృశ్రీ మెడికల్ సెంటర్ 1978 వ సంవత్సరంలో జిల్లెళ్ళమూడిలో ప్రారంభించబడింది. అమ్మ మాటల్లోని అంతస్సారాన్ని గ్రహించి ఆచరించాలి. త్యాగం, కరుణ, సేవ త్రిగుణాత్మకమైన ఆమెని ఆరాధించడమంటే సకల జీవుల పట్లా ఆదరణ చూపడమే. ఇదే అమ్మ అవతార పరమార్థం. దుష్టులను శిక్షించడం కాదు, దుష్టత్వాన్ని నశింపచేయాలి అనేవారు. జిల్లెళ్ళమూడి అమ్మ 1985, జూలై 12న తన అరవై మూడవ ఏట నిర్యాణం చెందారు. అమ్మ పాంచభౌతిక శరీరం విశ్వ తేజస్సులో లీనమైనప్పటికి ఆ ఆలోచనలు సజీవంగా ఉండిపోతాయి. ఆమె మాటలను అనుసరించి, ఆచరించడమే మన కర్తవ్యం.