సేవా భారతి విజయవాడ వారి ఆధ్వర్యంలో అభ్యాసిక టీచర్లు, కమిటీ సభ్యులు మరియు సేవా భారతి కార్యకర్తల కుటుంబ సభ్యుల సమ్మేళనము కృష్ణాజిల్లాలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినది. విజయవాడలో జరిగే 34 ఉచిత ట్యూషన్ సెంటర్ టీచర్లు మరియు కమిటీ సభ్యులు, కార్యకర్తల కుటుంబాలు 128 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .
విజయవాడ నుండి శ్రీ విజ్ఞాన విహార యాజమాన్యం వారి సహకారంతో 3 బస్సులలో బయలుదేరి పరిటాల శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందుకొని, అక్కడ నుండి కృష్ణాజిల్లా జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర పద్మావతి దేవి వార్లను దర్శనం చేసుకొని, ప్రక్క గ్రామమైన జయంతి నందు మామిడి తోటలో, కుటుంబ సభ్యుల పరిచయ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో వారి కుటుంబాల్లోని 3 తరాల వారు ( పిల్లలు, తల్లిదండ్రులు, తాతయ్య లు మామయ్యలు) కూడా పాల్గొన్నారు. గత వారము జరిగిన “బాలమేళ-2020” యొక్క సమీక్ష కూడా జరిగినది.
ఈ కార్యక్రమంలో సేవాభారతి విజయవాడ అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి సాయి కిషోర్, శ్రీ శుభ శేఖర్, శ్రీమతి మాధురి, కోశాధికారి శ్రీ సోలంకి, ఆరెస్సెస్ విజయవాడ విభాగ్ ప్రచారక్ శ్రీ సురేంద్ర, ఆరెస్సెస్ పశ్చిమ కృష్ణా జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఈ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ సురేంద్ర మాట్లాడుతూ, సేవాభారతి ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నదంటే, సేవాభారతి కార్యకర్తల కుటుంబ సభ్యులు, మరియు అభ్యాసికల టీచర్ల కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇన్ని కార్యక్రమాలు నిర్వహించ గలుగుతున్నదని చెప్పారు. స్థానిక స్వయంసేవకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకొనుట జరిగినది.