News

నంది విగ్రహం ధ్వంసం

123views

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం మాయమై సమీప పొలాల్లో కనిపించింది. విగ్రహాన్ని కొందరు దుండగులు ఎత్తుకెళ్లి కిలోమీటరు దూరంలో పంట పొలాల్లో ధ్వంసం చేశారు. సోంపేట సీఐ మంగరాజు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పురాతన నాణేల కోసం ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటన వెనక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కవ్వింపు చర్యల్లో భాగంగా ఎవరైనా ఈ పనికి పాల్పడ్డారా లేక పురాతన ఆలయం కావడంతో అప్పటి విగ్రహంగా భావించి ఎత్తుకెళ్లారా, ప్రతిష్ఠ సమయంలో పురాతన నాణేలు అమర్చి ఉంటారనే ఉద్దేశంతో చోరీకి పాల్పడ్డారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది.

సోంపేట సీఐ మంగరాజు మాట్లాడుతూ విగ్రహం ధ్వంసం వెనక ఉన్న కారణాలపై సమగ్ర విచారణ చేపడుతున్నామన్నారు. అర్చకసంఘం అధ్యక్షుడు భువనేశ్వర ప్రసాద్‌ పాణిగ్రహి మాట్లాడుతూ 200 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆలయమని, పురాతన విగ్రహం, నాణేల విషయమై చోరీకి పాల్పడే వ్యక్తులైతే నంది విగ్రహం కిందభాగాన్ని కూడా తవ్వాలని అభిప్రాయ పడ్డారు. అలాంటి చర్యలకు పాల్పడకుండా విగ్రహాన్ని మాత్రమే తొలగించి తీసుకెళ్లడం అనుమానాలకు తావిస్తుందన్నారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు, సేకరించిన ఆధారాల మేరకు ఇతర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.