News

శ్రీశైల గర్భాలయం వీడియో కలకలం

107views

శ్రీశైల గర్భాలయంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. గర్భగుడిలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడమే కాకుండా స్వామివారిని ఫోన్‌తో వీడియో చిత్రీకరించడం తీవ్ర కలకలం రేపింది. ఉగాది ఉత్సవాల రద్దీని ఆసరాగా చేసుకుని కర్ణాటకకు చెందిన ఒక భక్తుడు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గర్భగుడిలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై భక్తులు, అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘అపచారం’గా పరిగణించిన ఆలయ ఈవో (EO) ఎస్. శ్రీనివాసరావు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆలయ సూపర్‌వైజర్‌తో పాటు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భద్రతా పర్యవేక్షణలో విఫలమైనందుకు ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CSO)కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఈ భద్రతా వైఫల్యంపై ఆలయ యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వీడియో తీసిన కర్ణాటక భక్తుడిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడమే కాకుండా, అతనిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గతంలోనే ఆలయ పరిసరాల్లో వీడియోలు, రీల్స్ తీయడంపై నిషేధం ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంపై ఈవో సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో గర్భాలయం వద్ద స్కానింగ్, సెక్యూరిటీ తనిఖీలను మరింత పటిష్టం చేయాలని, భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో పై వైసీపీ పార్టీ స్పందిస్తూ.. ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేసింది. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని ఆలయాల పవిత్రతకు భంగం కలుగుతుందని తీవ్ర విమర్శలు చేసింది.