NewsProgrammsSeva

అంగరంగ వైభవంగా ‘సంఘమిత్ర’ 26 వ వార్షికోత్సవం.

652views

ర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 26 వ వార్షికోత్సవం, స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమం ఆద్యంతం  అభిమాన హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూస్తున్నంత  సంరంభంగా టౌన్ హాల్లో ఆహుతుల కేరింతలతో చప్పట్లతో మారు మోగిపోయింది.

సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ కర్నాటి నాగ సుబ్బారెడ్డి సారథ్యంలో, డివిజనల్ అటవీ శాఖ అధికారి మేధా పాటవ ప్రదర్శనతో, ప్రాధమిక ఉన్నత పాఠశాల ప్రధాన అధ్యాపకులు శ్రీ ఆకుల దాసయ్య జ్యోతి ప్రజ్వలనతో, ఎర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రిన్సిపల్ శ్రీ పగిడి వెంకటరామన్ ధ్వజారోహణంతో కార్యక్రమం ప్రారంభమైంది.

ప్రార్థన, చిన్నారుల భగవద్గీత పఠనం తర్వాత సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ నివేదిక సమర్పించారు.

సంఘమిత్ర చిన్నారులు వినూత్నంగా ప్రారంభించిన మేధా పాటవ ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ప్రదర్శన కనుమరుగైన గ్రామీణ గృహ పరికరాలు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, కూరగాయలు పళ్ళు, సనాతన ధర్మం రథసారథులైన పూర్వజుల తో ప్రారంభమై, భారతీయ గణిత మేధావులు వారి ఆవిష్కరణలు, వైదిక గణితం, మేదో ద్దీపన కలిగించే tangram puzzles, జలసంరక్షణ శుద్దీకరణ, మానవ మేధస్సు నిర్మాణం దాని గతివిధులు , సూక్ష్మదర్శిని,  కాంతి ప్రయోగాలు, న్యూటన్ గమన నియమాలు బాటిల్ రాకెట్ ప్రయోగం తో ముగిసింది.

చిన్నారులు వేద గణిత సూత్రాలను ఉపయోగించి ఆహుతులు సంధించిన గణిత సమస్యలను చిటికెలో పరిష్కరించి  సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు.

ఇక సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో దశావతారాలు, బంజారా నృత్యం,  కోలాటం, ఏక పాత్రాభినయంలో ద్విపాత్రాభినయం,  పిరమిడ్ లు,  దండ, నియుద్ధ , హాస్యనాటిక,  ప్రేరణ గీత్, చిత్రం రచన, వీర జవాన్ల పాట లాంటి వినూత్న కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలన్నీ చిన్నారులే చేశారా?  అని ఆహుతులు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయేంతగా  ఆకట్టుకున్నాయి.

ప్రధాన వక్త, క్షేత్ర సేవా ప్రముఖ్   మాన్య శ్రీ ఎక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ సంఘమిత్ర కు చిన్నారులు ఎలాంటి సామాజిక, మానసిక స్థితిలో చేరుతారు, వారు సమాజంలో ఎంత ఎత్తుకు ఎదుగుతారో ఉదాహరణలతో వివరించారు.

ఈ ప్రదర్శన ఆహూతులను ఉర్రూతలూగించిన  విషయాన్ని ప్రస్తావిస్తూ సంఘమిత్ర అనుసరించే సనాతన ధర్మ జీవనశైలే విద్యార్థుల సర్వాంగీణ ఉన్నతికి, సర్వశ్రేష్ట మూర్తిమత్వానికి ప్రధాన కారణమని తెలియజేశారు.

ప్రతి తల్లితండ్రి సమాజంలో పొంచి ఉన్న పాషండ శక్తుల బారిన పడకుండా తమ పిల్లలను కాపాడుకుంటూ సర్వశ్రేష్టంగా ఎదిగేలా కృషిచేసి సుధృడమైన హైందవ సమాజం నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యదర్శి నివేదికను ప్రస్తావిస్తూ సంఘమిత్ర  వినూత్న సేవా  కార్యక్రమాలతో సార్వజనీన త్వాన్ని , సర్వస్పర్శితత్వాన్ని ప్రముఖంగా ఉటంకించారు.

సాధారణ జీవనానికి దూరంగా నివస్తున్న అడవిబిడ్డలతో అను బంధాన్ని కొనసాగించ వలసిన ఆవశ్యకతను,  వారే కనుక పాషాండ శక్తుల కుయుక్తులకు  బలి అయితే మనం పరమపవిత్రంగా భావించే మన శ్రద్దా  కేంద్రాలకు వాటిల్ల  బోయే ప్రమాదాన్ని ఆహుతుల కళ్ళ ముందుంచారు.

క్రిక్కిరిసిన సభా ప్రాంగణాన్ని,  ఏర్పాట్లను ప్రస్తావిస్తూ విభాగ్ సంఘ్ చాలక్ డా. ఉదయ్ శంకర్, సంఘమిత్ర  ప్రాంత సహ కార్యదర్శి శ్రీ కామనూరు మనోహర్ నిర్దేశకత్వ, సంయోజకత్వంలో పరివార క్షేత్రాల ప్రముఖ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని తమ ఇంటి కార్యక్రమంలా శ్రమించి దిగ్విజయం చేసిన తీరును ప్రశంసించారు.

ప్రముఖంగా ‘మాతృమిత్ర’ మహిళామూర్తులు సేవా బస్తీలలో ఇల్లిళ్ళూ తిరిగి సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించిన తీరు ప్రశంసనీయమన్నారు.

నంద్యాల ప్రాంత వదాన్యులు తమ ప్రోత్సాహాన్ని ఇలాగే కొనసాగించాలని,  కార్యకర్తలు ద్విగుణీ కృతోత్సాహంతో వినూత్న సేవా ప్రకల్పాలతో కొనసాగుతూ పటిష్ట సామాజిక నిర్మాణానికి తమ వంతు కృషి కొనసాగించ గలరని భరోసా ఇచ్చారు.

సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన కార్యవర్గ సభ్యులకు, పరివార క్షేత్ర ప్రముఖులకు, దాతలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

మూడు సంవత్సరాలుగా వార్షికోత్సవ ఆహుతులకు  విందు ఏర్పాటుకు వితరణ చేస్తున్న శ్రీ సందు గోపీనాథ్ కు, ధన్యవాదాలు తెలియజేశారు.

రాజస్థాన్ సేవా సంఘ సభ్యుల సహకారంతో రాజస్థానీ మాతృ మూర్తులు తమ స్వహస్తాలతో చేసిన 3000 రోటీలు విందులో భాగమవటం  విశేషం.

మాతృ మిత్ర మహిళా మూర్తులు అహ్వానితులకు తమ స్వహస్తాలతో వడ్డించండాన్ని అందరూ అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.