స్థానిక గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో సేవాభారతి ద్వారా సేవాబస్తీ లలో నిర్వహింపబడే అభ్యాసికల వార్షికోత్సవం జరిగింది. గుంటూరు చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే వెనిగండ్ల, కొప్పురావూరు, జొన్నలగడ్డ, అగతవరప్పాడు, జన్మభూమి కాలనీ, నల్లకుంట, ఆంజనేయ కాలనీ ల నుండి 155 మంది బాల బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పిల్లలకు పలురకాల ఆటల పోటీలను నిర్వహించారు.
సాయంత్రం నాలుగు గంటలకు సభా కార్యక్రమం ప్రారంభమైంది. అధ్యక్షులు డాక్టర్ కె ఎస్ ఎన్ చారి గారు మాట్లాడుతూ చిన్నతనంలోనే దేశభక్తి, పెద్దల పట్ల గౌరవం అలవర్చుకోవడం, తోటివారికి సాయపడటం వంటి విషయాలు, సేవాభారతి కార్యక్రమాల ద్వారా నేర్పుతుంది అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ యామిని మాట్లాడుతూ మేము కేవలం ఆర్థికంగా సహాయ పడగలమే కానీ సేవాభారతి కార్యకర్తలు ఎంతో కష్టపడి చిన్నారులను తీర్చిదిద్దుతున్నారు. అది విలువ కట్టలేని సేవ అని కొనియాడారు. విశిష్ట అతిథిగా ఆర్ లక్ష్మీపతి మాట్లాడుతూ మోడీ గారి తండ్రి అహందాబాద్ రైల్వేస్టేషన్లో టీ కొట్టు నడిపేవారు వారి అమ్మ ఇళ్ళలో పాచి పనులు చేసేది. అలాంటి పేద కుటుంబంలో జన్మించిన మోడీ నేడు భారత దేశానికి ప్రధాని అయ్యారు. మనం అభివృద్ధి చెందడానికి పేదరికం అడ్డుకాదు అన్నారు.
ముఖ్యవక్త శ్రీ కొల్లదశపతి రావు గారు మాట్లాడుతూ “మనం చిన్నతనంలోనే గొప్ప వారిని ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్, వివేకానంద లాంటి వారు వేసిన బాటలో నడవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మన సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తిని విడనాడరాదు” అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాకాని పృథ్వీరాజు, డాక్టర్ హరిప్రసాద్,పోగుల వెంకటేశ్వరరావు గారు, యనుముల పిచ్చి రెడ్డి గారు, శ్రీమతి ఉదయ లక్ష్మి గారు,జాగు శ్రీనివాసరావు, శేషారావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా డాక్టర్ చింతా రామకృష్ణ గారు పాల్గొని పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. శ్రీ మతి శారద, విపులా దేవి గార్లను ఉత్తమ టీచర్లుగా ప్రకటించి సన్మానించారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మురికివాడల్లో నివసించే పిల్లలు కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రదర్శనలు చేశారు అని పలువురు ప్రేక్షకులు ప్రశంసించారు.