
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్‌లో పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో కుప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్ షాజాద్ (40) మరణించాడు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌తో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
వివరాల్లోకి వెళితే మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్పూర్ గ్రామ సమీపంలో కొందరు నేరస్థులు సంచరిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులను చూడగానే షాజాద్ మరియు అతని అనుచరులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో షాజాద్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
హతమైన షాజాద్ సామాన్య నేరస్థుడు కాదు. అతనిపై ఉన్న రికార్డులు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. షాజాద్ పైన సహారన్‌పూర్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో షాజాద్‌పై హత్యాయత్నం, దోపిడీ, గోవధ,గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద సుమారు 44 కేసులు నమోదై ఉన్నాయి. నిరంతరం పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న షాజాద్‌ను పట్టుకున్న వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 1 లక్ష రివార్డు కూడా ప్రకటించింది.
ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లకు గాయాలు
ఈ కాల్పుల సమయంలో షాజాద్ జరిపిన ఎదురుకాల్పుల్లో సోమేంద్ర, కుల్దీప్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలం నుండి పోలీసులు ఒక పిస్టల్ మరియు భారీగా తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ నేరస్థుడినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత సహారన్‌పూర్ సరిహద్దుల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.





