News

భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్, పాక్‌కు సాయం చేస్తున్న ఇద్దరు అరెస్ట్

101views

భారత్‌లో ఉగ్రవాద దాడులు జరిపేందుకు కుట్ర పన్నుతున్న ఓ ముఠా పట్టుబడింది. పుణ్యక్షేత్రాలు, కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు, లొకేషన్ వివరాలు సరిహద్దు అవతల ఉన్న పాకిస్థాన్ హ్యాండ్లర్లకు సోషల్ మీడియా ద్వారా పంపుతున్నారనే ఆరోపణలపై పాక్ ఆధారిత గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అధికారులు ఉగ్రకోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​ హాపుడ్‌లోని మొఘల్ గార్డెన్‌లో ఉన్న ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. అరెస్టు అయిన యువకులు ఒక ఆలయం, దిల్లీ కాలనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, లొకేషన్స్‌ను సోషల్ మీడియా ద్వారా ఒక పాకిస్థానీ గ్యాంగ్‌కు పంపుతున్నారని ఐబీ నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఇద్దర్ని అరెస్ట్ చేశామని వెల్లడించారు.

“ధౌలానాలోని మొఘల్ గార్డెన్‌లో ఉన్న ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇద్దరు యువకులను అరెస్టు చేశాం. అరెస్టు అయిన ఇద్దరు అనుమానితులలో ఒకరు మొఘల్ గార్డెన్‌కు చెందిన సలీం రాణా కుమారుడు అజీమ్ రాణా, మరొకరు మేరఠ్ జిల్లాలోని జై గ్రామానికి చెందిన నౌషాద్ కుమారుడు ఆజాద్ రాజ్‌పుత్. రాణా దిల్లీలోని ఒక మాల్‌లో డ్రైఫ్రూట్ స్టాల్ నడుపుతున్నాడు. రాణాకు బంధువైన రాజ్‌పుత్ గురుగ్రామ్‌లోని ఒక పైపుల ఫ్యాక్టరీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి దగ్గర నుంచి రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నాం” అని హాపుడ్ ఎస్పీ కున్వర్ జ్ఞానంజయ్ సింగ్ తెలిపారు.

ఇటీవల ఆరుగురు అరెస్టు
ఇటీవలే (మార్చి 15న) గాజియాబాద్‌లోని కౌశాంబి పోలీసులు ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 50 ప్రదేశాలలో రహస్య సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి వారు ప్రణాళికలు వేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కెమెరాలలో ఒకటి హరియాణాలోని సోనిపత్ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 3 దగ్గర ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ లైన్‌ స్తంభానికి నిందితులు అమర్చారు. ఈ క్రమంలో ఐబీ, ఎన్ఐఏ, ఇండియన్ రైల్వేస్ అధికారుల పర్యవేక్షణలో గాజియాబాద్ పోలీసులు బుధవారం (మార్చి 18) ఆ స్తంభం నుంచి రహస్య సీసీటీవీ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నెట్‌వర్క్‌లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరినీ గుర్తించడానికి, ఈ ఆపరేషన్ వెనుక ఉన్న కచ్చితమైన ఉద్దేశ్యాన్ని నిర్ధారించడానికి ఆర్పీఎఫ్, గాజియాబాద్ పోలీసులు, నిఘా సంస్థలు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నాయి.

గాజియాబాద్‌లో అరెసైన ఆరుగురు నిందితులలో ఒకడైన ప్రవీణ్‌ను భారీ భద్రత నడుమ బుధవారం మధ్యాహ్నం పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది సోనిపత్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రవీణ్ నుంచి అక్కడ పలు విషయాలను రాబట్టారు. అనంతరం అతడ్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోనిపత్ రైల్వే పోలీసులకు తెలియకుండా గాజియాబాద్‌కు చెందిన నిందితుడు తన ముగ్గురు సహచరులతో కలిసి ఈ సీసీటీవీ కెమెరాను ఫిబ్రవరి 26న ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

కుట్ర ఎలా బయటపడింది?
పాకిస్థానీ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఒక నేర ముఠా భారత్‌లో ఒక పెద్ద విధ్వంసక చర్యకు పాల్పడటానికి ప్రణాళిక రచిస్తోందని కేంద్ర నిఘా సంస్థలకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా కౌశాంబి పోలీసులు ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే పనిని తమకు అప్పగించినట్లు అరెస్టైన యువకులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.

మరోవైపు, హాపుడ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు తాము సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌లోని ఐఎస్ఐ మద్దతుగల షాజాద్ భట్టి ముఠాతో సంప్రదింపులు జరిపామని చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో జరిగిన ఘర్షణల కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన పాకిస్థాన్‌లోని షాజాద్ భట్టి గ్యాంగ్‌కు దిల్లీ, గ్రేటర్ నోయిడాలోని పలు ప్రాంతాల ఫొటోలు, వీడియోలు, లొకేషన్‌లను పంపినట్లు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న దిల్లీలోని రమేశ్‌నగర్ మెట్రోస్టేషన్ సమీపంలో ఉన్న ఓ ఆలయం, అక్కడి కాలనీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలను వాట్సాప్ ద్వారా షాజాద్ భట్టికి పంపినట్లు వెల్లడించాయి.

అప్రమత్తమైన దర్యాప్తు సంస్థలు
అయితే గాజియాబాద్‌లో ఆరుగురు, హాపుడ్‌లో ఇద్దరు అరెస్ట్ అయిన నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు మరింత అప్రమత్తం అయ్యాయి. ఈ రెండు ప్రదేశాల్లో అరెస్టైన వారు ఒకే గ్యాంగ్‌కు చెందినవారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.