
సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో జరిగే 34 అభ్యాసికల (ఫ్రీ ట్యూషన్ సెంటర్స్) వార్షికోత్సవము – బాల మేళా విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు జరిగినది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీ చలవాది మల్లిఖార్జున రావు, శ్రీకృష్ణ ప్రభు, శ్రీ పాములపాటి వెంకట శేషయ్య, మిత్రా ఆటో ఎజన్సీస్ సీఈఓ శ్రీ చెరువు శ్రీనివాస్, ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్, శ్రీ నరపత్ జైన్, శ్రీ తోటకూర రామకృష్ణ విచ్చేసి అభ్యాసిక విద్యార్థులచే రూపొందించబడిన విజ్ఞాన ప్రదర్శనను ప్రారంభించి, విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించి పిల్లలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సేవా భారతి అధ్యక్షులు డాక్టర్ ఎలమంచిలి సాయి కిషోర్ అధ్యక్షత వహించారు.

ప్రసంగిస్తున్న శ్రీ ఎక్కా చంద్రశేఖర్
ఈ కార్యక్రమంలో భాగంగా అభ్యాసికల విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిర్వహించే వివిధ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం జరిగినది. వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

డాక్టర్ అంబేద్కర్, భారతమాత, స్వామి వివేకానంద చిత్రపటాలకు నమస్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 1 లక్షా 56 వేల సేవా కార్యక్రమాలు సేవాభారతి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు తమ స్వయం ప్రేరణతో, నిస్వార్ధంగా సేవాభారతి ఆధ్వర్యంలో విద్య, వైద్య, సామాజిక, స్వావలంబన రంగాలలో కృషి చేస్తున్నారని, అనాధలకు ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు అనేక రంగాలలో తమ సమయాన్ని ఇచ్చి సేవలు అందిస్తున్నారని అదే స్ఫూర్తితో మరింతమంది యువత, విద్యార్థులు చిన్న వయసు నుంచే సేవా భావాన్ని అలవరచుకుని తన సమాజం కోసం కొంత సమయాన్ని ఇవ్వాలని కోరారు.

పిల్లల విజ్ఞాన ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్న పుర ప్రముఖులు
ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ” పిల్లలకు విజ్ఞానం తోపాటు వినోదం, వికాసం, సాంస్కృతిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని, దీనికొరకు విజయవాడ సేవా భారతి వారు కొనసాగిస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.
అనంతరం కార్యక్రమంలో భాగంగా అభ్యాసికల విద్యార్థినీవిద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిధులను, పిల్లల తల్లిదండ్రులను అబ్బురపరచాయి.

ఈ బాలమేళా – 2020లో 33 అభ్యాసికల నుండి 600 మంది విద్యార్థులు, 33 మంది అధ్యాపకులు, సుమారు మూడు వందల మంది తల్లిదండ్రులు, 500 మంది అతిథులు, ఆహ్వానితులు పాల్గొన్నారు. సుమారు 50 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమ ఏర్పాట్లలో స్వచ్ఛందంగా పాల్గొని పని చేశారు.





