
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా జలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతిని సుమారు 12 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తూ, ఆమెను మతం మార్చుకోవాలని బెదిరిస్తున్న నిందితుడు అష్ఫాక్‌ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలు (22) తన 10 ఏళ్ల వయసు నుండే నిందితుడి వేధింపులకు గురవుతోంది. నిందితుడు అష్ఫాక్ ఆమెను లోబరుచుకుని, ఇన్నాళ్లుగా నిరంతరం లైంగికంగా దోపిడీ చేస్తూ వచ్చాడు. అంతటితో ఆగకుండా, ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇక బాధితురాలు ఆ హింసను తట్టుకోలేక, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడిపై అత్యాచారం, కిడ్నాప్ మరియు ‘ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం’ కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న అష్ఫాక్‌ను మార్చి 3వ తేదీన హౌజ్ టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక బృందం పట్టుకుంది.
నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం అష్ఫాక్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మహిళలపై ఇటువంటి దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని జౌన్‌పూర్ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.





