ArticlesNews

భావ కవితా యుగ ప్రవక్త దేవులపల్లి కృష్ణశాస్త్రి

154views

(ఫిబ్రవరి 24 – దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి )

కొంతమంది మహానుభావుల పుట్టుక ఒక నిర్దిష్టమైన కార్యం కొరకు నిర్ణయించబడి అందుకు తగినవిధంగానే వారి జీవనశైలి సూత్రీకరించబడుతుంది. ఇందుకు చక్కటి ఉదాహరణ దేవులపల్లి కృష్ణశాస్త్రి. తెలుగు సాహిత్య సీమలో తన జీవితాన్ని సాగించి, అమూల్యమైన సాహిత్య మణిపూసలను, రత్నాలను మనకు అందించారు. ఆంధ్రా షెల్లీగా వాసికెక్కిన ఈ మహారచయిత, లలిత గేయాల సృష్టికర్త, అష్టావధాని నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలోని చంద్రపాలెంలో 1897 నవంబరు 1న జన్మించారు. బాల్యం నుండే తెలుగు సాహిత్య విలువల మాధుర్యాన్ని చవిచూసిన మన దేవులపల్లి, చిన్నతనంలోనే పద్య రచనలమీద ఎంతో మక్కువను ఏర్పరుచుకొన్నారు. అత్యంత చిన్నవయసులోనే అష్టావధానం నిర్వహించే స్థాయికి వారి సాహిత్య పరిణతి చేరింది. చదువుకుంటూనే సాహిత్య కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరిచేవారు.

గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక భాషావాదం, నాడు ఎంతో చైతన్యంతో నడుస్తున్న బ్రహ్మసమాజ ఉద్యమ ప్రభావం కృష్ణశాస్త్రి మీద ప్రబలంగా ఉండేవి. విద్యార్థిగా ఉంటూనే తెలుగు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తూ ఎంతో పేరును సంపాదించారు. ఆ క్రమంలోనే ‘జయము జ్ఞాన ప్రభాకరా జయము క్రాంతి సుధాకరా’ అనే ప్రార్థనా గీతాన్ని బ్రహ్మ సమాజం కోసం మరియు మనందరికీ సుపరిచితమైన ‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి, జయజయజయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి’ గీతాన్ని తను బోధిస్తున్న పాఠశాల విద్యార్థుల కోసం రాశారు. మన జాతీయగీతానికి ఏమాత్రం వాశిలో తగ్గకుండా రచించిన ఈ దేశభక్తి గీతం వింజమూరి అనసూయాదేవి గారి స్వరకల్పనతో నాడు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొంటున్న దేశభక్తులందరిలో చైతన్యాన్ని రగిలించింది. నేటికీ మనందరికీ కూడా ఈ గీతం ఒక మధురానుభూతిని కలిగిస్తున్నది.

ప్రకృతితో మమేకమైనప్పుడే మనిషిలోని నిజమైన కవి, అతని భావుకత్వం బయటకు వస్తుంది. వాటికి అక్షరరూపం కల్పించినప్పుడు వాడే భావజాలము కృష్ణశాస్త్రి గారికి తెలిసినంతగా మరేకవికి తెలియదు కనుకనే ఆయన కలం నుండి వేలకొలది లలితగేయాలు వెలువడ్డాయి. సజీవమైన ప్రకృతి సరిగమలు, నిత్య జీవన జనస్రవంతి, అభ్యుదయ భావ వితరణలు, మన కృష్ణశాస్త్రి కవితా వస్తువులు. కనుకనే ఆయన రచనలు నేటికీ ఎంతో మంది కవులకు ఆదర్శప్రాయమై నిలుస్తున్నాయి. ఆయన రచించిన గేయసంహిత ‘అమృత వీణ’ లోని ఎన్నో మధురమైన లలితగీతాలు మన తెలుగు సాహిత్యానికి ప్రత్యేకమైన వన్నెను ఆపాదించాయి. నేటికీ ఎంతోమంది గాయకులూ, గాయనీమణులు తమ గాత్రంతో ఆ లలితగీతాలకు ప్రాణం పోస్తూ వాటి ప్రాముఖ్యతను సదా నిలుపుతున్నారు.

భావ కవిత్వానికి సినిమా పాటల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో ఒక సముచిత స్థానాన్ని కల్పించడంలో కృష్ణశాస్త్రి కృషి అమోఘం. ఆయన పాటలన్నీ అమృతం కురిపించిన రసగుళికలు. కృష్ణశాస్త్రి ఎన్నో ఖండకావ్యాలను, నాటి సామాజిక స్థితిగతులను వివరించే వ్యాసాలను, నాటికలను కూడా రచించారు. సినిమాలకు పాటలు రాస్తూనే, ఆకాశావాణికి రేడియో రూపకాలు రాసేవారు. ఆకాశవాణిలో వుండగా ‘విప్రనారాయణ’, ‘క్షీరసాగర మథనం’ వంటి యక్షగానాలు స్వయంగా వ్రాసి వాటిని అద్భుతంగా ప్రదర్శింపజేశారు. దేవులపల్లి వారి ప్రతిభను, సాహిత్యసేవను మెచ్చి ఆయనకు ఎన్నో సన్మానాలు, ప్రశంసలు లభించాయి. 1976లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్‌’ అవార్డునిచ్చి గౌరవించింది. 1978లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను అత్యత్భుతంగా నిర్మించుకొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 1980 ఫిబ్రవరి 24న తనువు చాలించారు. తెలుగు భాష ఉన్నంతవరకు ఆయన కవితలు, పాటలు నిలిచి ఉంటాయి. ఆ పాటలు, కవితలు మనల్ని అలరిస్తొన్నంతవరకు కృష్ణశాస్త్రి చిరంజీవే..