News

భారత్‌ దెబ్బతో అన్నీ నష్టాలే.. పాక్‌ మంత్రి ఆవేదన

127views

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పాక్‌కు ఫార్మా రూపంలో మరో షాక్‌ తగిలింది. భారత వ్యాక్సిన్లు పాకిస్తాన్‌లో అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ల దిగుమతికి 400 మిలియన్‌ డాలర్లు అవుతోందని పాక్ ఆరోగ్య మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం, భారత్‌పై ఆగ్రహంతో పాక్‌ ఆంక్షలు విధించడంతో ఇటు ఇండియా కూడా ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే ఫార్మా ఉత్పత్తులు(మెడిసిన్‌) కేంద్రం నిలిపివేసింది. దీంతో, పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. మందుల కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ఆరోగ్య మంత్రి ముస్తాఫా కమాల్‌ స్పందిస్తూ.. భారత వ్యాక్సిన్లు లేకపోవడంతో మా దేశంపై మరింత భారం పడుతోంది. ప్రస్తుతం ఏటా దాదాపు 400 మిలియన్‌ డాలర్లతో వ్యాక్సిన్‌లను దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో 49 శాతం ఖర్చులను గావీ(గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (GAVI)) ద్వారా పనిచేసే అంతర్జాతీయ సంస్థలు, మిగతా 51శాతం వాటా ప్రభుత్వం భరిస్తోంది. స్థానికంగా టీకా ఉత్పత్తి ప్రారంభించకపోతే.. 2031 నాటికి దిగుమతి కోసం దాదాపు రూ.10వేల కోట్లు (1.2 బిలియన్‌) ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో మా దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందన్నారు.

ఇదే సమయంలో వ్యాక్సిన్ల సరఫరాకు అంతర్జాతీయ మద్దతు 2031 నాటికి ముగుస్తుందని కూడా ఆయన చెప్పారు. కరోనా సమయంలో లక్షలాది కొవిడ్‌ టీకాలను భారత్‌ నుంచి సేకరించడంలో గావీ సహాయం చేసిందన్నారు. దాతల మద్దతుపై ఆధారపడకుండా స్థానికంగా టీకాల తయారీకి సన్నాహాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే, పాక్‌ ప్రభుత్వం ప్రస్తుతం పౌరులకు 13 రకాల వ్యాక్సిన్‌లను ఉచితంగా అందిస్తుంది. అయినప్పటికీ ఏదీ స్థానికంగా ఉత్పత్తి చేయడం లేదు. వ్యాక్సిన్లు అన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. పాకిస్తాన్‌లో దాదాపు 24కోట్ల జనాభా ఉండగా.. ఏటా 62 లక్షల జననాలు నమోదువుతున్నాయి. దీంతో అక్కడ వ్యాక్సిన్ల డిమాండ్‌ భారీగా ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్లు, ఇతర మందులు పలు దేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యూనైజేషన్‌ (GAVI).. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లోని పిల్లలకు టీకాలు అందించేందుకు పనిచేస్తుంది.