News

స్పెషల్‌ ఆపరేషన్‌తో గుహలో దాక్కున్న ఉగ్రవాదులు ఖతం

147views

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో భద్రతా దళాలు బుధవారం స్పెషల్‌ ఆపరేషన్‌తో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఓ గుహలో తలదాచుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే పక్కా సమాచారం అందుకున్న బలగాలు ఎన్‌కౌంటర్‌లో వాళ్లను హతమార్చి ఆపరేషన్‌ పూర్తి చేశాయి.

భద్రతా దళాలు ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి, స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో.. ఆపరేషన్ క్లిష్టంగా మారినా, సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు సాగి వారిని అంతం చేసింది. ఈ ఆపరేషన్‌లో.. గుహ నుంచి రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరికొందరు ఉగ్రవాదులు దాక్కున్నారా? అనే అనుమానంతో గాలింప చర్యలను ముమ్మరం చేశాయి.

జైష్-ఎ-మొహమ్మద్ గతంలో కూడా జమ్మూ కశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో ఆ దాడుల ఆగిపోయాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆ సంస్థ యాక్టివ్‌ అయ్యింది. భద్రతా బలగాలు సకాలంలో స్పందించడంతో దాడుల ముప్పు తప్పింది.