News

భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్‌ రామనాథన్‌కు క్రాఫోర్డ్‌ ప్రైజ్‌

114views

భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్‌ రామనాథన్‌(82)ను భూ విజ్ఞానశాస్త్రంలో నోబెల్‌గా భావించే క్రాఫోర్డ్‌ ప్రైజ్‌ వరించింది. కాలుష్య మేఘాలు, క్లోరోఫ్లోరో కార్బన్‌ (సీఎఫ్‌సీ)ల వంటి సూపర్‌ పొల్యూటెంట్లపై దశాబ్దాల పాటు చేసిన పరిశోధనకు ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. రామనాథన్‌ ‘నాసా’కు పనిచేస్తున్న సమయంలో కార్బన్‌డయాక్సైడ్‌ కంటే ఫ్రిడ్జ్‌లు, ఏరోసోల్స్‌లో ఉపయోగించే సీఎఫ్‌సీలే 10 వేల రెట్లు ఎక్కువగా భూ వాతావరణంలో ఉష్ణాన్ని పట్టి ఉంచుతాయని కనుగొన్నారు. దీంతో గ్లోబల్‌ వార్మింగ్‌కు కార్బన్‌ డయాక్సైడే ప్రధాన కారణమని అప్పటి వరకూ ఉన్న భావనను ఆయన సమూలంగా మార్చేసినట్లయింది.

మదురైలో పుట్టి.. సికింద్రాబాద్‌లో ఉద్యోగం
తమిళనాడులోని మదురైలో రామనాథన్‌ జన్మించారు. చదువు తర్వాత తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఉన్న ఓ ఫ్రిజ్‌ల కర్మాగారంలో సీఎఫ్‌సీ విభాగం ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం అన్నామలై యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో పైచదువులు చదువుకున్నారు. ఇండియన్‌ ఓషన్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ఇండోఎక్స్‌) పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనంలో ఆయన ప్రధానంగా దక్షిణాసియాపై దృష్టి సారించారు. ఇక్కడ కాలుష్య మేఘాలు (బ్రౌన్‌ క్లౌడ్స్‌) వాతావరణంలో పెరిగిపోయి భారత రుతుపవనాల ప్రభావాన్ని క్షీణింపజేస్తున్నాయని, హిమాలయాల్లోని హిమనదాలు కరిగిపోవడాన్ని వేగవంతం చేస్తున్నాయని కనుగొన్నారు. రామనాథన్‌ ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలోని స్క్రిప్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో డిస్టింగ్విష్డ్‌ ప్రొఫెసర్‌ ఎమెరిటస్‌ హోదాలో ఉన్నారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో మేలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయనకు క్రాఫోర్డ్‌ ప్రైజ్‌తో పాటు 8 మిలియన్‌ స్వీడిష్‌ క్రూనార్‌ (రూ.8.23 కోట్లు)ల రివార్డును ప్రదానం చేయనున్నారు.