
అయోధ్యలో రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్‌కు కేంద మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు లోక్‌సభలో చెప్పారు.
మంత్రివర్గ సమావేశం నుంచి నేరుగా లోక్‌సభకు వచ్చిన మోదీ.. ప్రశ్నోత్తరాలకు ముందు ఈ ప్రకటన చేశారు. ‘బుధవారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో అయోధ్య అంశంలో మేం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. మందిర నిర్మాణం, అభివృద్ధి సంబంధిత అంశాలపై ఈ ట్రస్ట్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది’ అని తెలిపారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని కోరారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు చెరిగిపోని విశ్వాసాన్ని ప్రదర్శించారన్నారు. ఇందుకు 130కోట్ల మంది భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామ జన్మభూమి భూవివాదంపై గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలం రామ్‌లల్లాకే చెందుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రధాని పరోక్షంగా స్పందించారు. భారత్‌లో హిందు, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, బుద్ధులు, పార్శీ, జైన్.. ఇలా అందరూ ఒకే కుటుంబమని చెప్పారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరగాల్సిందేనని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడి ఆనందం కోసం ‘సబ్‌కా సాథ్.. సబ్ కా వికాస్’ విధానంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మోదీ తెలిపారు.





