ArticlesNews

మన్యంలో నిత్యం పండగలే

92views

అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ఆహ్లాదకర వాతావరణం, ప్రశాంతతకు నిలయం. ఇక్కడ కొండల మధ్య జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. సాధారణంగా హిందూ పండగలంటే వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి వంటివే గుర్తుకొస్తాయి. మన్యంలో పండగలు నిర్వహించే తీరు భిన్నంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఏదో ఒక పండగ నిర్వహిస్తూ.. వారి ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు గిరిజనులు.

జనవరిలో వచ్చే సంక్రాంతి పండగ మూడు రోజుల్లో ముగుస్తుంది. గిరిజన ప్రాంతాల్లో దీన్ని నెల రోజులపాటు చేస్తారు. సంప్రదాయ థింసా నృత్యాలతో సందడి చేస్తుంటారు. ఫిబ్రవరిలో చీపుర్ల పండగ నిర్వహిస్తారు. అడవుల్లో చీపుర్ల సేకరణకు వెళ్లే ముందు దీన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదీ నెల్లాళ్లపాటు ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో ఇటుకుల పండగ చేస్తారు. ఆ నెల రోజులూ గిరిజనులంతా అమితానందోత్సాహాలతో ఉంటారు. పనులకు వెళ్లరు. మగవారు అడవుల్లో వేటకు వెళ్తారు. మహిళలు తాచేరు వసూలు చేస్తూ సందడి చేస్తారు. ఆగస్టు నెలలో కొర్ర కొత్త వేడుకలు నిర్వహిస్తారు. పంటలకు తెగుళ్లు రాకుండా జోల్డా పండగ, కోతలు పూర్తయ్యాక శీతాలు వేడుక నిర్వహిస్తుంటారు. ఊరు దోషం పండగను నిత్యం చేస్తూనే ఉంటారు. ఇవికాక సంక్రాంతి నుంచి గిరిజన గ్రామాల్లో గ్రామ దేవతల జాతరలు జరుగుతుంటాయి. ప్రతి గ్రామంలోనూ ఇవి నిర్వహిస్తారు.

వినూత్నంగా రామడోలి
చింతపల్లి మండలం తాజంగికి భిన్నప్రాంతాల సమాహారంగా పేరుంది. ఒడిశా నుంచి వలసవచ్చిన వీరు ఇప్పటికీ సంప్రదాయ పండగలను ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందులో ప్రధానమైనది రామడోలి. మూడేళ్లకోసారి భక్తిశ్రద్ధలతో వినూత్నంగా నిర్వహిస్తారు. అవతార పురుషుడైన శ్రీరాముడిని తలచుకుంటూ మంచి పరిపాలన, పాడి పంటలు, ఆయురారోగ్యాలు కలిగించాలని ఆ భగవంతునిని ప్రార్థిస్తూ ఈ వేడుకలు చేస్తారు. గ్రామస్థులంతా బంధువులను ఆహ్వానించి మర్యాదలు చేస్తారు.

కనువిందు చేసే హోలీ: తాజంగిలో హోలీ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇందుకోసం సుమారు 70 అడుగుల ఎత్తున కట్టెలతో భారీ హోలీ శిఖరాన్ని నిర్మిస్తారు. దానిపై ఓ ఎర్రటి జెండాను కడతారు. హోలీ రోజున తెల్లవారుజామున ఈ కట్టెల శిఖరాన్ని కాలుస్తారు. శిఖరాగ్రంలో ఉన్న జెండా ఎటువైపు పడుతుందో ఆ దిక్కున ఆ సంవత్సరం బాగా పంటలు పండి సుభిక్షంగా ఉంటుందని గిరిజనుల నమ్మకం. ఆ జెండా కింద పడుతుండగా పట్టుకున్న వ్యక్తికి అదృష్టం వరిస్తుందన్న నమ్మకం వారిలో ఉంది. ఇతన్ని గ్రామంలోని శ్రీకృష్ణుని ఆలయం వరకూ ఊరేగింపుగా తీసుకొచ్చి సత్కరిస్తారు.

బలమైన కారణాలు
గిరిజనులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రతి పండగ వెనుకా శాస్త్రీయతతోపాటు సామాజిక కోణాలు దాగి ఉన్నాయి. సంక్రాంతి తర్వాత నుంచి నిర్వహించే గ్రామదేవతల జాతరల వెనుక బలమైన కారణమే ఉంది. యుక్తవయసు వచ్చిన గిరిజన యువతీ యువకులు ఈ జాతర్లలో ఒకరినొకరు చూసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పూర్వీకులు జాతరలు ఏర్పాటుచేశారు. జాతర్లలో ఒకరికొకరు ఇష్టపడితే పెద్దల అంగీకారంతో అదే గ్రామదేవత సన్నిధిలో వివాహం చేసే ఆచారం ఇప్పటికీ ఉంది.