News

నరిగమ్మ ఆలయం మార్పు తగదు

211views

అనంతపురం రూరల్‌ మండలం పాపంపేట శివారున కళ్యాణదుర్గం రోడ్డులో వెలిసిన మైసూరు నరిగిమ్మ ఆలయాన్ని అక్కడి నుంచి తరలించడం సబబు కాదని శృంగేరి విరూపాక్షి మఠం పీఠాధిపతి విద్యానృసింహ భారతి మహాస్వామి అన్నారు. నరిగమ్మ ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. పలు హిందూ సంఘాల ప్రతినిధులు, వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శృంగేరి విరూపాక్షి మఠం పీఠాధిపతి విద్యా నృసింహ భారతి మహాస్వామి ప్రసంగిస్తూ.. దేవాలయాలు అంటే ఇటుకలు, రాళ్ల నిర్మాణాలు మాత్రమే కాదని, అవి ప్రజల ఆత్మవిశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అనంతపురం ప్రాంతంలో శతాబ్దాలుగా ప్రజల విశ్వాసాలకు కేంద్రంగా నిలిచిన నరిగమ్మ అమ్మవారి గుడిని తరలించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. భక్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండా, గ్రామసభ నిర్వహించకుండా దేవాలయాన్ని తరలించడం ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం అన్నారు. ఇదే పరిస్థితి రేపు ఏ గ్రామంలోనైనా జరుగుతుందనే భయం ప్రజల్లో కలుగుతోందన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని ధర్మాన్ని, ప్రజల విశ్వాసాలను అణచివేసే అభివృద్ధి మాత్రం తమకొద్దని అన్నారు. ఇప్పటికై నా గుడి తరలింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌ మాట్లాడుతూ ఆలయ తరలింపు వ్యవహారంలో ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్నారన్నారు. కోర్టు తీర్పు కాదు ప్రజాతీర్పుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ తరలింపును ఒప్పుకోబోమన్నారు.