
తమ స్వరాన్ని, సాహిత్యాన్ని అయ్యప్ప స్వామికి అర్పించాలనుకునే భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. తాము సొంతంగా రాసిన, రూపొందించిన పాటలను శబరిమల సన్నిధానంలోని లౌడ్‌స్పీకర్లలో ప్లే చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. భక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, ప్రఖ్యాత గాయకులు పాడిన పాత పాటలతో పాటు, కొత్తగా స్వరపరిచి, రికార్డ్ చేసిన పాటలు ప్లే లిస్ట్‌లో చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ గతేడాది నుంచి అమలు చేశామని, దీనికి విశేష స్పందన లభించిందని దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌వో) జి.ఎస్.అరుణ్ తెలిపారు. సొంత పాటలను ట్యూన్ చేయాలని కోరిక ఉన్నవారు ఏడాదిలో ఎప్పుడైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లే లిస్ట్‌లో చేర్చుకునేందుకు కొన్ని నియమాలు పాటించాలి. పాటను సొంతంగా రాసి, ట్యూన్ చేయాలి. ఎవరూ కాపీరైట్ చేయలేదని పేర్కొంటూ అఫిడవిట్‌తో పాటు సంతకం చేసిన పత్రాలను సమర్పించాలి. ఈ పాటకు సంబంధించిన (రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు) వారి సంతకాలు, వారు అనుమతించినట్లు ధ్రువీకరించే పత్రాలను కూడా అప్లికేషన్‌లో చేర్చాల్సి ఉంటుంది. పాటలను శబరిమల సన్నిధానంలోని పీఆర్‌వోకు పెన్ డ్రైవ్ ద్వారా అందించాలి. తర్వాత పాట నాణ్యతను నిపుణుల కమిటీని పరిశీలిస్తుంది. అనంతరం రిజిస్టర్ చేసుకున్న కొత్త పాటలను ప్రకటనల మధ్య విరామ సమయాల్లో ప్రసారం చేస్తారు.





