ArticlesNews

నాదబ్రహ్మ త్యాగయ్య

46views

తిరువయ్యూరు త్యాగరాజ ఆరాధన

అరవై నాలుగు కళల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అది ఏ సంగీతమైనా అందులోని మాధుర్యాన్ని అనుభవించడంలో ఆనందం ఉంటుంది. పాటలకు రాగాలను సమకూర్చి, సంగీతానికి సిద్ధాంతాలను రూపొందించి నిర్దిష్టమైన సంప్రదాయాలను ప్రవేశపెట్టిన మహనీయులు ఎందరో! వారిలో నాదబ్రహ్మ త్యాగయ్య చిరస్మరణీయులు, గొప్ప వాగ్గేయకారులు.

త్యాగయ్య తంజావూరు జిల్లాలో కావేరీ నదీ తీరంలోని తిరువారూరులో సీతమ్మ, రామబ్రహ్మం దంపతులకు 1767 మే నాలుగో తేదీన జన్మించారు. తన ఆరాధ్య దైవాలైన సీతారాముల పేర్లే తన తల్లిదండ్రుల పేర్లు కూడా కావడం తన అదృష్టంగా భావించేవారట. బాల్యం నుంచి పరమ రామభక్తుడైన త్యాగయ్య తండ్రి దేవతార్చన చేసుకునేటప్పుడు నిత్యం పక్కనే కూర్చుని తన్మయత్వంతో గొంతుకలిపేవారు. ఒకరోజు అలాగే భక్తిపారవశ్యంలో ‘నమో నమో రాఘవా’ అనే కీర్తన పాడగా తండ్రి ఆశ్చర్యపోతూ ‘ఇంత చక్కటి పాట ఎక్కడ నేర్చుకున్నావు?’ అని అడిగారు. ‘నోటికి వచ్చింది, పాడేశాను’ అన్నారట త్యాగయ్య. అది విని కొడుకు గొప్ప వాగ్గేయకారుడు అవుతాడని రామబ్రహ్మం ఆనాడే పసిగట్టారు.

ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా త్యాగయ్యకు సంగీతం నేర్చుకోవాలన్న కోరిక తీరే మార్గం కనిపించలేదు. ఊరి వెలుపల ఉన్న పూలతోటకెళ్లి తండ్రి పూజకు పూలు కోసుకొచ్చేవారు త్యాగయ్య. ఆ దారిలోనే శొంఠి వెంకట రమణయ్య అనే సంగీత విద్వాంసుడి ఇల్లు ఉండేది. రోజూ పూలు తెస్తూ ఆ ఇంటి ముందు ఆగి ఆయన శిష్యులకు చెప్పే సంగీత పాఠాలను శ్రద్ధగా వినేవారు త్యాగయ్య. ఒకరోజు అలాగే సంగీతపాఠంలో లీనమై ఇంట్లో తండ్రి పూజ విషయం మర్చిపోయారు. దాంతో వెతుక్కుంటూ వెళ్లిన రామబ్రహ్మానికి వెంకట రమణయ్య ఇంటి ముందు నిలబడి పాఠం వింటున్న కొడుకు కనిపించాడు. వెంటనే అతణ్ని తీసుకుని రమణయ్య దగ్గరికి వెళ్లి విషయం వివరించారు. అప్పటికే త్యాగయ్య పేరు విని ఉన్న రమణయ్య అతణ్ని శిష్యుడిగా చేర్చుకున్నారు. ఓ సందర్భంలో వెంకట రమణయ్య ఇంట్లో జరిగిన సంగీత సభలో గురువు ఆనతి మేరకు త్యాగయ్య అప్పటికప్పడు బిలహరి రాగంలో ‘దొరకునా ఇటువంటి సేవ’ అనే కీర్తన ఆశువుగా ఆలపించారు. ముగ్ధుడైన గురువు ఆనందం పట్టలేక త్యాగయ్యను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. అప్పట్నుంచీ త్యాగయ్య కీర్తిప్రతిష్ఠలు దశదిశలా వ్యాపించాయి.

తండ్రి మరణానంతరం త్యాగయ్య శిష్యులను కూడదీసుకుని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ తన గానమాధుర్యంతో శ్రోతలను పరవశులను చేస్తూ రామభక్తి సాగరంలో మునిగితేలేవారు. త్యాగయ్య రాసి స్వరపరచిన ఆణిముత్యాల్లాంటి అయిదు కీర్తనలను పంచరత్నాలంటారు. ఏటా శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో ఈ అయిదు కీర్తనలను సామూహికంగా గానం చేయడం ఆనవాయితీ. ఆ ఉత్సవాల్లో పాల్గొని విద్వాంసులతో గొంతు కలిపి పాడటాన్ని అదృష్టంగా భావిస్తారు సంగీత కళాకారులు. ఐహిక ప్రలోభాలకు దాసులవకుండా నాదబ్రహ్మగా కీర్తి పొంది ఆరాధనలు అందుకుంటున్న త్యాగయ్య ప్రాతఃస్మరణీయులు.