News

ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ట్రైబల్ మ్యూజియం రూపకల్పన

184views

ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానం నేటి తరానికి తెలియజేసే విధంగా ట్రైబల్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేటలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి ఎంతో పురాతనమైనదని, విశిష్టత కలిగినదని పేర్కొన్నారు. ఆదివాసీ జీవన విధానం, సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, కళారూపాలు వంటి అంశాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మ్యూజియం ద్వారా ఆదివాసీ గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయడం జరుగుతుందన్నారు.

ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బ్లాకులను మంత్రి సందర్శించారు. సందర్శకులను ఆకట్టుకునే విధంగా మ్యూజియాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దినట్లు మంత్రి తెలిపారు. మ్యూజియంలో ప్రపంచ గిరిజన జాతులు బ్లాక్, భారతదేశంలోని గిరిజన జాతులు, రాష్ట్రంలోని గిరిజన జాతులు, జిల్లాలో నివసించే స్థానిక గిరిజన జాతులు అనే బ్లాక్ లు ఏర్పాటు చేసి ఆయా గిరిజన జాతుల సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణ, జీవన శైలి ప్రతిబింబించేలా చిత్రపటాలను ఏర్పాటు చేశారు. అలాగే గిరిజన స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను చాటిచెప్పేలా విప్లవ చరిత్రకు సంబంధించిన ఛాయాచిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. గిరిజనుల కళలు, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే విధంగా పూర్వకాలంలో వారు వినియోగించిన ఆభరణాలు, వంట పాత్రలు, ఆయుధ సామాగ్రి, వ్యవసాయ పనిముట్లు, సాంప్రదాయ సంగీత వాయిద్యా పరికరాలను మ్యూజియంలో ప్రదర్శించడం జరిగింది. ఈ మ్యూజియం గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలవడమే కాకుండా విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులకు విజ్ఞాన కేంద్రంగా ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.