
రాజశేఖర్,
విహెచ్‌పి వర్కింగ్ ప్రెసిడెంట్, కేరళ
శబరిమలలో బంగారం చోరీకి సంబంధించి, 2018-19, 2023-24, 2025 కాలంలో అడ్డు అదుపు లేకుండా దోపిడీ జరిగింది. శబరిమల ఆలయ అమూల్య నిధులుగా పరిగణించే అతి ముఖ్యమైన బంగారు పూత గల రేకుల గోపురాలను కూడా (తాళికక్కుడమ్‌లు) కూడా స్వర్ణ పూత గల కొత్త రేకులను అమర్చే నెపంతో దొంగిలించినట్లు అర్థమవుతోంది.
అయితే, సెప్టెంబర్ 7, 2025న తిరువోణం పండుగ సందర్భంగా ఆలయాన్ని వేడుకల కోసం తెరిచారు. సెప్టెంబర్ 7 సాయంత్రం చంద్రగ్రహణం ఉన్నందున, ఆలయాన్ని సాధారణ సమయం కంటే చాలా ముందుగానే మూసివేశారు. ‘హరివరాసనం’ పాడి గర్భాలయాన్ని మూసివేసిన తర్వాత, సోపానం వైపు వెళ్ళే అన్ని గ్రిల్ గేట్లకు తాళం వేసి, CCTV కెమెరాలను నిలిపివేశారు. తర్వాత ద్వారపాలక శిల్పాలు, సోపాన మెట్లు, ద్వారబంధాలు (కట్టలప్పడి), ద్వారబంధం పైన అమర్చిన లక్ష్మీ విగ్రహాన్ని తొలగించి అక్కడి నుండి తీసుకెళ్లారు. వీటిని రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా అక్రమంగా తరలించారు.
8వ తేదీ తెల్లవారుజామున, విశ్వహిందూ పరిషత్ (VHP)కి అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం, VHP యూట్యూబ్ ఛానెల్ ‘హిందూ విశ్వాస్’ ద్వారా విడుదలైంది. అనంతరం, రిపోర్టర్ టీవీ ద్వారా VHP రాష్ట్ర బాధ్యులు ఈ సమాచారాన్ని వెల్లడించారు. దీని ద్వారానే బయటి ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. తర్వాత, ఆ రోజు నుంచి VHP కేరళ విభాగం రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను సంఘటితం చేసి నేరుగా నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టింది. ప్రజాగ్రహం కారణంగా మొదట ఆరన్ములలోని తిరువాభరణం కమిషనర్ కార్యాలయం వద్ద, ఆ తర్వాత తిరువనంతపురంలోని దేవస్వం బోర్డు ప్రధాన కార్యాలయం, ఇతర కీలక ప్రాంతాలలో భారీ నిరసనలు, ఆందోళనలకు ప్రణాళిక వేశారు.
9వ తేదీ నాటికి, ఈ విషయంపై పంబలోని కేరళ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) శ్రీ వినోద్‌కు విశ్వహిందూ పరిషత్ అధికారికంగా ఫిర్యాదు సమర్పించి, దానికి సంబంధించిన రసీదును పొందింది. ఈ దర్యాప్తు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాలతో ముడిపడి ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా, పురాతనమైన, అత్యంత విలువైన ఈ వస్తువులు, అక్కడ సమర్పణ జరిగిన అనేక విగ్రహాలు పురాతన వస్తువులను దోచుకునే అంతర్జాతీయ దొంగల చేతుల్లోకి చేరినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేరంలో అంతర్జాతీయ సంబంధం కూడా ఉన్నట్లు ఇది సూచిస్తోంది.
ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా జరిగే విచారణ సరిపోదని గ్రహించి, సీబీఐ (CBI) విచారణ కోరుతూ కేరళ హైకోర్టులో కేసు దాఖలైంది. కానీ, నేటి వరకు దీనిపై కోర్టు ఖచ్చితమైన నిర్ణయానికి రాకపోవడం విచారకరమైన వాస్తవం. అదేవిధంగా, స్వామివారి గర్భాలయం (శ్రీకోవిల్)కు సంభవించిన భారీ నష్టం దృష్ట్యా, ‘దేవప్రశ్నం’ (జ్యోతిష్య విచారణ) నిర్వహించాల్సిందిగా దేవస్వం బోర్డును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో మరో కేసు దాఖలైంది. అయితే ఈ విషయాలపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఎన్‌ఐఏ (NIA) వంటి కేంద్ర సంస్థలు నిందితులందరినీ అరెస్టు చేసేలా ఖచ్చితమైన, నిష్పక్షపాత విచారణ చేయకపోతే, చోరీకి గురైన బంగారం, ఇతర వస్తువులను పూర్తిగా స్వాధీనపరచుకుని స్వామివారి సన్నిధికి తిరిగి చేర్చాలని VHP పట్టుబట్టింది. ఆ మేరకు చట్టపరమైన చర్యలను ప్రారంభించింది.
పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా 1998-99 కాలంలో గర్భాలయానికి బంగారు పూత పూయడానికి 42.8 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని శబరిమలకు కానుకగా సమర్పించారు. పాదరసాన్ని ఉపయోగించి 21 పొరలుగా పూసిన ఈ బంగారాన్ని దేవస్వం అధికారులు, సిబ్బంది, మధ్యవర్తులు వివిధ సమయాల్లో దోచుకున్నారు. ఇది విగ్రహాలను దోచుకునే అంతర్జాతీయ దొంగలకు అప్పగించినట్లు అందరూ నమ్ముతున్నారు. శబరిమల, దేవస్వం బోర్డు అన్ని చట్టాలను, అలాగే కేరళ హైకోర్టు ఆదేశాలన్నింటినీ ఉల్లంఘించి దేవస్వం బోర్డు అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు. వీటితో పాటు స్వామివారి జపమాల, ముద్రమాల, యోగదండాన్ని కూడా మార్చేశారు. అమూల్యమైన పురాతన వస్తువులు, దైవీకశక్తి గల వస్తువులు దోపిడీ అయ్యాయి. చోరీకి గురైన వస్తువులను స్వాధీనపరచుకోవడంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇంకా విజయం సాధించలేదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి వరకూ దర్యాప్తు ప్రక్రియ చేరలేదు. వామపక్ష ప్రభుత్వంలోని దేవస్వం మంత్రులు, దేవస్వం బోర్డు అధ్యక్షులు, సభ్యులు, బోర్డు సీనియర్ అధికారులు, వారు నియమించిన మధ్యవర్తులు కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. పోయిన బంగారంతో పాటు దేవుని ఇతర వస్తువులన్నింటినీ కనిపెట్టి దేవుని ముందు ఉంచాలి. దోషులకు గుణపాఠం నేర్పేలా శిక్షించాలి.




