News

పాక్‌ నిఘా సంస్థతో సంబంధాలున్న 15 ఏళ్ల బాలుడు అరెస్ట్‌

143views

ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్నవారు, ఉగ్ర మద్దతుదారులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాక్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పఠాన్‌కోట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన బాలుడు దాదాపు ఏడాదిగా ఐఎస్‌ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉంటూ.. భారత సైనిక స్థావరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని వారికి లీక్‌ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అరెస్టు చేసిన బాలుడితో పాటు పంజాబ్‌కు చెందిన పలువురు మైనర్లకు కూడా ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

వెంటనే పంజాబ్‌లోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పాక్‌తో సంబంధాలు కొనసాగిస్తోన్న ఇతర బాలురను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం పంజాబ్‌లోని మైనర్ల ఆన్‌లైన్‌ కార్యకలాపాలు, కదలికలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. భారత యువతను లక్ష్యం చేసుకోవడానికి పాక్‌ నిఘా సంస్థ పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు, యువతలో భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపించేందుకు ఐఎస్ఐ‌ ఏజెంట్లు పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు.