News

హవ్వ … హిందూ దేవాలయం ఆవరణలోనే మత మార్పిడులా?

1.3kviews

అందరూ ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల ఆగడాలు రోజు రోజుకీ పెచ్చు మీరుతున్నాయి. ఎక్కడో దూరంగా, దొంగచాటుగా ఒకరిద్దరిని మతమార్పిడులు చేసుకునే పాస్టర్లు ఇప్పుడు ఏకంగా పదుల సంఖ్యలో, హిందూ దేవాలయాల ప్రాంగణాలలోనే మతం మార్చడానికి సిద్ధపడి పోతూ ఉండటం ఒకింత ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ఆ మధ్య  విజయవాడ కనకదుర్గమ్మ గుడికి కూతవేటు దూరంలో కృష్ణానదిలో గల ఫెర్రీ ఘాట్లో  47 మంది హిందువులను మతం మార్చిన ఘటన మరువక ముందే మరళా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ఒక దేవాలయ ప్రాంగణంలోనే కొందరు హిందువులకు బాప్టిజం ఇవ్వడానికి కొందరు పాస్టర్లు సాహసించడం ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న గో పాదాల రేవులో కొందరు పాస్టర్లు మతమార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించడానికి యత్నించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

పరస్పరం వాదించుకుంటున్న దృశ్యం

కొవ్వూరులోని స్థానిక శివాలయాన్ని ఆనుకొని ఉన్న రేవు వద్దకు కొందరు హిందువులను తీసుకువచ్చి వారికి బాప్టిజం ఇప్పించడానికి కొందరు పాస్టర్లు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న హిందూ చైతన్య వేదిక కార్యకర్తలు అక్కడికి వెళ్లి  వారిని అడ్డుకున్నారు. “మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అంటూ వారిపై ప్రశ్నలు సంధించారు.మతం మార్చడానికి అక్కడికి తీసుకు రాబడిన హిందువులు కొందరు “పాస్టర్ గారు రమ్మంటే వచ్చామండీ” అంటూ అమాయకంగా బదులిచ్చారు. “ఇది దేవాలయ ప్రాంగణం అని మీకు తెలుసు కదా? ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని చైతన్య వేదిక సభ్యులు పాస్టర్లను నిలదీయగా వారు ఏమీ బదులివ్వకుండా అక్కడినుంచి పారిపోవడానికి యత్నించడంతో శివశక్తి సభ్యులు స్థానిక పోలీసువారికి సమాచారం అందించారు. పోలీసు వారు వచ్చి వారిని స్టేషన్ కు తరలించారు.

అనంతరం గ్రామంలో జరిగిన సమావేశంలో 8 కులాలకు చెందిన పెద్దలు మరియు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూర్చుని జరిగిన పరిణామాలపై చర్చించుకున్నారు. ఇక మీదట గ్రామంలో ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదని, మత మార్పిడులను అనుమతించకూడదని, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏవైనా జరిగితే హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమష్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.