ArticlesNews

రథ సప్తమి సందర్భంగా విద్యార్థినీ విద్యార్థుల సూర్య నమస్కారాలు.

832views

ప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |

శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు.

సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

నెల్లూరులో…

రథసప్తమిని పురస్కరించుకుని ఈరోజు నెల్లూరు జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో డాక్టర్ మల్లెల రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థునులు, మరియు జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు సామూహిక సూర్యనమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ సభ్యులు శ్రీ గుర్రం సుధాకర్, నర్సింగ్ కళాశాల ఇంచార్జ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మరియు యోగ మాస్టర్ శ్రీ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు

అనకాపల్లిలో…

అలాగే రాష్ట్ర సేవా సమితి గుడిలోవ వారి అనకాపల్లి శ్రీరామనగర్లో గల మాధవ విద్యా విహార పాఠశాల ఆధ్వర్యంలో గాంధీనగర్లో రథసప్తమి సందర్భంగా బాలలు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ముఖ్యఅతిథిలుగా భారత వికాస పరిషత్ అధ్యాపకులు శ్రీ ఉమామహేశ్వరరావు, విద్యుత్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ పొందిన శ్రీ తర్రా రమణ, మహాత్మ జ్యోతిబా పూలే బాలుర ఆవాస విద్యాలయం వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ దొడ్డి కిషోర్ మరియు విద్యార్థులూ పాల్గొన్నారు.

అనంతపురంలో…

రథ సప్తమి సందర్భంగా అనంతపురం శ్రీ పొట్టి శ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాల నందు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో మాస్టర్ రవి పర్యవేక్షణలో బాలబాలికలచే సూర్య నమస్కారములు చేయించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ రజిత యాదవ్ మాట్లాడుతూ రథసప్తమి విశిష్టతను, నిత్యజీవితంలో సూర్యుని వలన ఉపయోగములను వివరించినారు. అనంతరం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి దాని నివారణ చిట్కాలు, ముందు జాగ్రత్త కోసం తీసుకొనవలసిన చర్యల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రీ ప్రసాద్ మరియు ఆరోగ్య భారతి కార్యకర్తలు కోనేటి రమణ బాబు, గెల్లి రతన్ బాబు, సామా కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.