
174views
విద్య, ఆరోగ్యం అనేవి రెండూ ముఖ్యమైన అవసరాలని, అవి అందరికీ అందుబాటులో వుండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. చంద్రపూర్ లో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ కేన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ లేదా మరేదైనా అనారోగ్యం సవాలుతో కూడుకున్నదేనని, అయితే ఈ సవాలును ప్రతి ఒక్కరూ అధిగమించాలనే కోరుకుంటారన్నారు. ఇది ఒక ప్రాంతానికే పరిమితమైన సమస్య కాదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది కనిపిస్తూనే వుందని, ప్రజలందరికీ విద్య, ఆరోగ్యం అనే రెండు ముఖ్యమైన అవసరాలని, అవి అందుబాటులో వుండాలన్నారు. అలాగే ఈ సౌకర్యాలు సరసమైన విధంగా కూడా అందుబాటులో వుండాలని ఆకాంక్షించారు.
కేన్సర్ కేవలం రోగిని మాత్రమే చంపేయదని, యావత్ కుటుంబాన్ని నాశనం చేసే వ్యాధి అని అన్నారు. ఒక్క వ్యక్తికి గనక కేన్సర్ వస్తే, కుటుంబం మొత్తానికి చుట్టేస్తుందని తెలిపారు. దాని చికిత్స కోసం అత్యధిక వ్యయం అవసరం అవుతుందని, దీంతో కుటుంబాలు నిరాశ చెందుతాయని, మానసిక క్షోభను కూడా అనువభవిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో, ప్రభుత్వం మరియు టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చికిత్స కోసం తీసుకున్న చొరవ ప్రశంసనీయమని అభినందించారు. దేశ వ్యాప్తంగా కనీసం 15 ప్రాంతాల్లో ఇలాంటి ఆస్పత్రులు వున్నాయని, నాగపూర్ లో కూడా పెద్ద కేన్సర్ ఆస్పత్రి వుందని గుర్తు చేశారు.ఇలాంటి ఆస్పత్రులు సమీప జిల్లాల నుంచి, గ్రామాలనుంచి వచ్చే రోగులకు చికిత్స చేయడంలో సహాయపడతాయని అన్నారు. పండిట్ దీన్‌దయాళ్ చంద్రపూర్ క్యాన్సర్ ఆసుపత్రి చికిత్స బాధ్యతను తీసుకుందని ఆయన అన్నారు.కానీ, చంద్రపూర్ నివాసితులుగా, ఇక్కడి ప్రజలు రోగులకు మానసిక బలాన్ని అందించడానికి, వారి కుటుంబాలను ఓదార్చడానికి మరియు వారి బంధువులను ఆదుకోవడానికి కూడా చొరవ తీసుకోవాలని సూచించారు.

ఈశ్వరుడు మనకు శరీరాన్ని ఇచ్చారని, వాటిని సేవ కోసమే వినియోగించాలని సూచించారు. డబ్బే అవసరం లేదని, సమయం మాత్రమే అవసరమని, ఈ భావాన్నే పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.వైద్యులతో పాటు రోగులకు సేవ చేయడం ద్వారా, కుటుంబ సభ్యులు ఆందోళనల నుండి ఉపశమనం పొందుతారని, రోగులు కూడా ఆరోగ్యవంతులుగా తయారవుతారని, తృప్తి చెందుతారన్నారు. చంద్రపూర్‌లో ఆధునిక క్యాన్సర్ చికిత్సా కేంద్రం ప్రారంభించబడటం గర్వకారణమని పేర్కొన్నారు.





