News

భారత్‌ను శక్తిమంతమైన దేశంగా వాజ్‌పేయీ నిలబెట్టారు: వెంకయ్యనాయుడు

174views

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితం తెరిచిన పుస్తకమని.. ప్రతి పేజీ స్ఫూర్తిదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆశయ సాధన కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. వాజ్‌పేయీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు.

‘‘బీజేపీకి బలమైన పునాది వేసిన వ్యక్తుల్లో వాజ్‌పేయీ ముందు వరుసలో ఉంటారు. ఆయన్ను శ్యామాప్రసాద్‌ ముఖర్జీ శిష్యుడిగా ఎంచుకున్నారు. వాజ్‌పేయీ అంటే సుపరిపాలన. యువతకు ఆదర్శం. ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నామా? లేదా? అనేది ప్రతి కార్యకర్త ఆలోచించుకోవాలి. నైతిక పాలన, సామాజిక బాధ్యత, రాజ్యాంగం పట్ల అంకితభావంతో పనిచేయాలి. రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరిగితే అలా పనిచేస్తున్నట్లు కాదు. నేతలకు తప్పుడు భాష మాట్లాడటం అలవాటైపోయింది. వారు శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే. నేను పదవీ విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలేదు.

వాజ్‌పేయీ భారత్‌ను శక్తిమంతమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టారు. దేశ రక్షణ విషయంలో కఠినంగా ఉన్నారు. పీవీ నరసింహారావు సంస్కరణలు తీసుకొస్తే.. వాటిని ఆచరణలో పెట్టిన వ్యక్తి వాజ్‌పేయీ. తన వల్లే యుద్ధాలు ఆగిపోతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకోవడం సరికాదు. రాజనీతి, దౌత్యనీతి ప్రదర్శించే వ్యక్తి ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసిన ఆర్మీ, శాస్త్రవేత్తలకు హ్యాట్సాఫ్‌. ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం సరికాదు. ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగారా?నాణ్యమైన విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. ఉచితాలకు స్వస్తి పలికి.. కష్టపడే వారికి చేయూతనివ్వాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీలను ప్రోత్సహించకూడదు’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.