ArticlesNews

పురాతన కళకు ప్రాణం పోస్తున్న టిటిడి శిల్ప కళాశాల

217views

భారతీయ పురాతన కళకు ప్రాణం పోస్తూనే జీవితాన్ని మలచుకునే అవకాశాన్ని యువతకు కల్పిస్తోంది టిటిడి శిల్ప కళాశాల. హిందూ ఆలయాల సంస్కృతిని కాపాడుతూ.. సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం- టిటిడి 1960లో శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ (శిల్ప కళాశాల) పేరుతో దీన్ని ప్రారంభించింది. నాటి నుంచి కళా సంపదకు.. సంప్రదాయ కళలకు ఇది పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది. ఎందరో యువ కళాకారులను అక్కున చేర్చుకొని నిపుణులుగా తీర్చిదిద్దుతోంది.

మొదట నాలుగేళ్ల వ్యవధితో కోర్సు ప్రారంభించారు. 1986 నుంచి రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ సంస్థ పర్యవేక్షణలో ఏటా పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేస్తున్నారు.

ప్రస్తుత కోర్సులు: ఆలయ నిర్మాణం, సుధా శిల్పం, దారు శిల్పం, లోహ శిల్పం, సంప్రదాయ చిత్రలేఖనం, కలంకారి చిత్రలేఖనంపై కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చేరిన విద్యార్థులకు ఉచిత శిక్షణ, వసతి సదుపాయం ఉంటుంది.

ప్రవేశం పొందగానే ప్రోత్సాహం
ప్రతి విద్యార్థి పేరిట బ్యాంకులో తితిదే ఈవో సంయుక్త ఖాతాతో కలిపి రూ.లక్ష నగదు మొదటి ఏడాదిలో ప్రవేశం పొందిన వెంటనే డిపాజిట్‌ చేస్తారు. ఈ మొత్తాన్ని నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి అయిన తర్వాత బ్యాంకు వడ్డీతో కలిపి రూ.1.40 లక్షలు విద్యార్థుల ఉపాధి కోసం అందజేస్తారు.

విద్యార్థులను నాలుగో సంవత్సరంలో దక్షిణ భారతదేశ ఆలయ సందర్శన పేరిట విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తారు. ఆలయాల విశేషాలతో పాటు శిల్పాలు ఎలా చెక్కారు.. నిర్మించారు.. అనే అంశంపై అవగాహన కల్పించే రీతిలో ఆచార్యులు ఉపదేశిస్తారు.

ఉపాధి, ఉద్యోగాలు తథ్యం..
కళాశాలలో ఇప్పటి వరకు వెయ్యి మంది వరకు చదవగా వారందరూ పలు రంగాల్లో స్థిరపడ్డారు. వంద మంది దేవాదాయ శాఖలో, 30 మంది తితిదే ఇంజినీరింగ్‌ విభాగంలో 50 మంది శ్వేతలో పనిచేస్తున్నారు. 120 మంది దేవాలయ నిర్మాణ గుత్తేదారులుగా, 15 మంది సినీ సెట్టింగ్స్‌ విభాగంలో ఉన్నారు. విదేశాల్లో 20 మంది ఉద్యోగ అవకాశాలు పొందారు.-వెంకటరెడ్డి, శిల్ప కళాశాల ప్రిన్సిపల్‌