News

హిందుత్వ సాంస్కృతిక, మానవ కల్యాణ పరంపర : అంబేకర్

207views

సమాజాన్ని జాతి నిర్మాణం అన్న దానితో అనుసంధానించాలన్న లక్ష్యంతోనే హెడ్గేవార్ ఆరెస్సెస్ ను స్థాపించారని, గత వంద సంవత్సరాలుగా ఈ ఆలోచనతోనే సంఘ్ పనిచేస్తోందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. సంఘ్ నడుపుతున్న శాఖల ద్వారా క్రమశిక్షణ, దేశభక్తి, సేవా స్ఫూర్తిని పెంపొందుతోందని, దీని ద్వారా సమాజంలో జాతీయ చైతన్యం విస్తరించిందన్నారు.
సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఇండోర్ స్టేడియంలో ‘‘భారత్ బోధ్’’ కార్యక్రమం జరిగింది. ఇందులో అన్ని వర్గాల మేధావులు, యువకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సునీల్ అంబేకర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం, దేశ విభజన, ఎమర్జెన్సీ, వేర్పాటువాద కాలంలో ఆరెస్సెస్ స్వయంసేవకులు చురుకైన, సానుకూల పాత్ర పోషించారన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో సంఘ్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ రెండు సార్లు జైలుకెళ్లారన్నారు. సంఘ్ దేశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సాంస్కృతిక కోణంలోనే చూస్తుందని, సమాజంలో జాతీయతను వ్యాప్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి నిలుపుతుందని వివరించారు.
ambeker23
వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని అంబేకర్ పునరుద్ఘాటించారు. నిత్య శాఖలో క్రీడలు, పాటలు, సంఘ ప్రార్థన ద్వారా సాధారణ వ్యక్తుల్లో నాయకత్వ నైపుణ్యాలు, సేవా స్ఫూర్తి అనేవి అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సంఘ్ లో బాధ్యతలు అనేవి ఆకాంక్షల కంటే లక్షణాలు, కుశాగ్రబుద్ధి, సామర్థ్యం అన్న లక్షణాల ఆధారంగానే అప్పగించడం జరుగుతుందన్నారు.
ambeker2
హిందుత్వ అనేది రాజకీయ భావన కానేకాదని, వేల సంవత్సరాలుగా వస్తున్న సాంస్కృతిక, మానవ కల్యాణ పరంపర అని అంబేకర్ అభివర్ణించారు. దేశంలో విభజన వాదం అన్న గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న శక్తులు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని, దీనిని ఎదుర్కోవడంలో సమాజం పాత్ర చాలా వుందన్నారు.
దేశ రక్షణ అనేది కేవలం సైన్యం బాధ్యత మాత్రమే కాదని, అవగాహన కలిగిన, బాధ్యతాయుతమైన పౌరుల పాత్ర కూడా వుంటుందన్నారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు సమాచారాన్ని ఫార్వార్డ్ చేయవద్దని మరియు అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
భారతదేశం సైనికంగా, ఆర్థికంగా మరియు సాంస్కృతికంగా బలోపేతం కావాలని, దీని ద్వారా ఎలాంటి దుష్ట శక్తులు భారత్ పై దృష్టి పెట్టలేవన్నారు. ఆత్మవిశ్వాసంతో నిండిన సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగితే, రాబోయే 20 సంవత్సరాలు దేశానికి చాలా ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు.