ArticlesNews

జాగరూకతతో మెలగటమే ధన్యమార్గం, ధర్మమార్గం.

185views

రేపటి తరం క్షేమం, సంక్షేమం కోసం నిద్రాహారాలను సైతం మరచి తల్లిదండ్రులు పడే తపన భవిత పట్ల వారి జాగరూకతకు ప్రత్యక్ష ఉదాహరణ. వ్యక్తి తనకు ఇష్టమైనచోట, అయినవారితో క్షేమంగా బతకాలన్న ఆపేక్షతో, నిరంతరం జాగరూకుడై ఉండటం సహజం. జాగరూకత ప్రతి జీవి ప్రాథమిక అవసరమే కాదు, స్వీయ రక్షణా బాధ్యత.

ప్రాపంచిక విషయాల పట్ల వ్యక్తి చూపే దృక్పథమే ఆ వ్యక్తికి ఆయా అంశాలపై ఒక వైఖరిని ఏర్పాటు చేస్తుంది. బాల్య, యవ్వన, ప్రౌఢ, వృద్ధావస్థల్లో ఆయా విషయాల పట్ల ఆ వైఖరి స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటుంది. జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, కలిగిన ఆనందాలు, విషాదాలే దృక్పథంలో మార్పునకు ప్రధాన కారణం కావచ్చు. ఊహించని విధంగా జీవితంలో ఎప్పుడైనా అత్యంత ఇష్టమైన మనుషులు లేదా వస్తువుల పట్ల కూడా సదరు వ్యక్తి విరక్త స్థితిలోకి అడుగు పెట్టవచ్చు. అలా జరిగినప్పుడు అదే దశలో తనలో చోటుచేసుకునే మార్పు పట్ల ఆసక్తి పెరుగుతుంది. తను ఏయే పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నానన్న ఆత్మావలోకనం మొదలవుతుంది. ఈ మార్పు అరిషడ్వర్గాల పట్ల జాగరూకతను పెంచుతుంది. అది జ్ఞానం పెంచుకునేందుకు మార్గాన్ని అన్వేషిస్తుంది. అవిద్య నుంచి విద్యకు తోవ చూపుతుంది. ‘తస్మాత్‌ జాగ్రత జాగ్రత!’ అంటూ బోధించిన శంకరుల అద్వైతామృత లహరిలో మనసును ఓలలాడిస్తుంది. వ్యర్థ ప్రేలాపనలతో మట్టికొట్టుకుని, మలినమైపోయిన గుండె గదిని శుద్ధి చేస్తుంది. తత్త్వం అన్న ఉపనిషత్‌ వాక్యం ప్రకారం ఏదైతే దైవమున్నదో అదే నేనుగా ఆ దైవికశక్తిని మనోమందిరంలో ప్రతిష్ఠిస్తుంది. ఆ మూర్తిపై త్రికరణ శుద్ధిగా చిత్తం నిమగ్నమవడానికి కారణమవుతుంది. ఆ చిదానందాన్ని ఆస్వాదించడానికి ప్రేరణనిస్తుంది.

విహారార్థం భార్యలతో కలిసి సరోవరానికి వెళ్లిన గజేంద్రుడు మొసలి బారిన పడ్డాడు. తీవ్ర పోరాటం జరిపిన తదుపరి ఓటమి దశలో తనలోని అంతర్యామిని కాపాడమని వేడుకున్నాడు. మదిలో దాగిన దైవం పట్ల గజేంద్రుడు ప్రదర్శించిన జాగరూకత తనకు తక్షణం సాయాన్ని అందించింది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే హరినామ స్మరణతో పునీతుడైనవాడు. ‘వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక’ అంటూ చదువులలో సారమంతా ఆ పరంధాముడి పట్ల ఎరుక మాత్రమేనని నిర్వచించి నిరూపించిన భక్తుడు ప్రహ్లాదుడు.

అవసరానికో, ఆత్మబుద్ధికో మనకు సాయం అందించేందుకు దేవుడు ఉన్నాడన్న తలంపు ఒకింత మంచిదే కదా! అందుకే తల్లి చిన్న పొట్టలో ఊపిరి పోసుకున్న జీవి సంరక్షణకు పూనుకున్నది ఎవరో? రేపటికల్లా ఇన్ని పనులు అంటూ చాంతాడంత జాబితా రాసుకున్న మనిషి కదలక మెదలక కంటినిండా నిదురపోతే కాపాడేవారెవరో? జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్న జీవిని భవబంధాల నుంచి విముక్తుణ్ని చేసి తనలో లీనం చేసుకునేవారు ఎవరో? ఆ దైవం పట్ల మనిషిగా నిరంతర జాగరూకతతో మెలగటమే ధన్యమార్గం, ధర్మమార్గం.