
తిరుపతిలో డెల్లా వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. డెల్లా టౌన్‌షిప్స్ సంస్థ 1,400 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతుంది. మొత్తం స్థూల అభివృద్ధి విలువతో (జీడీవీ) కలిపి సుమారు రూ.35 వేల కోట్లతో హిందూమతంపై ప్రపంచంలోనే తొలి 5,000 ఏళ్ల జీవన ప్రదర్శన (లివింగ్ ఎగ్జిబిషన్)ను ఏర్పాటు చేయనున్నారు. డిజైన్ ఫ్యూచరిస్ట్, డెల్లా టౌన్‌షిప్స్ వ్యవస్థాపకులు జిమ్మీ మిస్త్రీ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందులో స్థానికులకే 80 శాతం మేర ఉద్యోగాలు కేటాయించనున్నారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుదారుల సదస్సులో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం వివరాలు, ప్రాజెక్టు ప్రత్యేకతలను డెల్లా టౌన్‌షిప్ సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), రాష్ట్ర పర్యాటకశాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ పేర్కొంది.
హిందూమతానికి సంబంధించిన విభిన్న జ్ఞాన పరంపరలు, సంప్రదాయాలు, ఆచారాలను దేశవ్యాప్తంగా ఏకీకృతం చేయడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం
300 ఎకరాల్లో లివింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక్కొక్కటి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 25 పెవిలియన్లు ఉంటాయి. సింధూలోయ నాగరికత నుంచి ఆధునిక హిందూ తత్వచింతన వరకూ భారత నాగరికతను ఇవి ప్రతిబింబిస్తాయి.
వేద విజ్ఞాన వ్యవస్థలు, శాస్త్రీయ కళలు, ఆలయ నిర్మాణ శిల్పం, ఆచారాలు, ప్రాంతీయ సంప్రదాయాలు వంటివి ప్రదర్శనలో ఉంటాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పెవిలియన్ల రూపకల్పనలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు ఆహ్వానించనున్నారు.
లివింగ్ ఎగ్జిబిషన్‌తోపాటు విలాసవంతమైన నివాసాలు, ప్రైవేట్ విల్లాలు అభివృద్ధి చేయనున్నారు.
600కు పైగా గదులతో ఫైవ్ స్టార్ రిసార్ట్‌లు.
డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలు అందుబాటులోకి రానున్నాయి.





