ArticlesNews

1704 నాటి చమ్‌కౌర్ వీరగాథ : మట్టి గోడల హవేలీలో 40 సింహాలు చేసిన అజేయ యుద్ధం

216views

చలిగా, కఠినంగా ఉన్న ఆ వర్షపు రాత్రి (డిసెంబర్ 20, 1704), గురు గోవింద్ సింగ్ జీ తో పాటు ఇంకా సుమారు 400 మంది సిక్కులు చివరికి ఆనంద్‌పూర్ సాహిబ్‌ను విడిచిపెట్టారు. ఖురాన్‌పై ప్రమాణం చేసి, ఎలాంటి హాని తలపెట్టమని వాగ్దానం చేసిన మొఘల్ జనరల్‌ల మాటలు నమ్మడంతో పాటు.. సుదీర్ఘంగా జరుగుతున్న యుద్ధం కారణంగా ఆహారం, మందుగుండు సామాగ్రి లేకపోవడంతో గురువు ఈ నిర్ణయం తీసుకున్నారు. సిక్కులు కోట నుండి బయలుదేరగానే, మొఘల్ సైన్యాలు ప్రమాణాన్ని ఉల్లంఘించాయి. వారిపై బాణాలు, బుల్లెట్లతో దారుణంగా దాడి చేశాయి. గురువును పట్టుకోవడానికి తీవ్రంగా యుద్ధం చేస్తోన్న భారీ మొఘల్ సైన్యంపై పోరాటాన్ని గురు సాహిబ్ ఆపలేకపోయారు. ఈ దాడిలో, గురువు తల్లి మాతా గుజ్రి జీతో పాటు, ఇద్దరు చిన్న కుమారులు.. తొమ్మిదేళ్ల జోరావర్ సింగ్ మరియు ఏడేళ్ల ఫతే సింగ్.. గురువు నుండి విడిపోయారు. వారు అడవులు, పొలాల గుండా ప్రయాణించి, చివరికి చమ్‌కౌర్ గ్రామంలోని చిన్న మట్టి కోట (గర్హి) వద్దకు చేరుకున్నారు. ఇటు రణక్షేత్రంలో గురువుతో పాటు కేవలం 40 మంది సిక్కులు, ఆయన ఇద్దరు పెద్ద కుమారులు (సాహిబ్‌జాదా అజిత్ సింగ్, జుఝార్ సింగ్) మరియు పంజ పియారాలు (ఐదుగురు ప్రియమైనవారు) ఉన్నారు.

 

గర్హి లోపల భీకర ప్రతిఘటన

ముందు ముందు ఏం జరగబోతోందో.. ఆ చిన్న మట్టి కోటకు (గర్హి) తెలియదు. కానీ అది సిక్కు చరిత్రలో అత్యంత గొప్ప అధ్యాయాలలో ఒకదానికి సాక్ష్యంగా నిలవబోతోంది. మరుసటి రోజు ఉదయం, 1704 డిసెంబర్ 21 నాటికి, గురు జీ మరియు సిక్కులను ఊహించలేని దృశ్యం చుట్టుముట్టింది. వేల సంఖ్యలో ఉన్న మొఘల్ సైనికులు మరియు కొండ ప్రాంత యోధులు.. గర్హి చుట్టూ వలయం ఏర్పరిచారు. గురు గోవింద్ సింగ్ జీని బ్రతికి ఉన్నా, చనిపోయినా పట్టుకోవడమే వారి ఏకైక లక్ష్యం. తాము ప్రాణాలతో బయటపడలేమని సిక్కులకు స్పష్టంగా తెలుసు. కానీ.. వారికి లొంగిపోవడం అనేది ఎప్పుడూ ఒక ఎంపిక కాలేదు.

అమృతవేళ (సూర్యోదయం కంటే ముందు ఉన్న పవిత్ర సమయం) మొదలైనప్పుడు.. గురు సాహిబ్, భాయి సంగత్‌తో కలిసి సిక్కుల పవిత్ర ప్రార్థన అయిన ‘ఆసా ది వార్’ కోసం కూర్చున్నారు. బయట భారీ సైన్యం ఉన్నా, గర్హి లోపల వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఆ తరువాత, మొఘల్ దూత ఒకరు చర్చల కోసం వచ్చాడు. గురు సాహిబ్ ఆ దూతను వెళ్ళిపోమని, లేదంటే మరణాన్ని ఎదుర్కోమని చెప్పారు. ఆ సమయంలోనే, ఆ చిన్న మట్టి కోట గోడల లోపల, గురు సాహిబ్ యుద్ధాన్ని ప్రకటించారు. కేవలం 40 మంది సిక్కులు మాత్రమే వేలాది మంది మొఘల్ సైన్యానికి ధైర్యంగా ఎదురు నిలబడ్డారు. వారి ధైర్యం గురువు యొక్క ప్రముఖ బోధనను ప్రతిధ్వనించింది: “ఒక సిక్కు సవా లక్షకు (1,25,000 మందికి) సమానం.”

సాహిబ్‌జాదా అజిత్ సింగ్ వీరత్వం

సంఖ్యా పరంగా చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. సిక్కులు, మొఘలులకు భారీ నష్టాన్ని కలిగించారు. ఆ సమయంలో, గురు సాహిబ్ పెద్ద కుమారుడైన సాహిబ్‌జాదా అజిత్ సింగ్, యుద్ధభూమిలోకి వెళ్లడానికి.. గురు సాహిబ్‌ అనుమతి కోరారు. “పితా జీ (ప్రియమైన తండ్రీ), నేను యుద్ధభూమిలోకి వెళ్లి పోరాడటానికి నన్ను అనుమతించండి. పాంథ్ సేవలో నా జీవితాన్ని ఫలప్రదంగా మరియు యోగ్యంగా మార్చుకునే అవకాశాన్ని నాకు ప్రసాదించండి”. అని అన్నారు. అప్పుడు గురు సాహిబ్ గర్వంగా తన కుమారుడి వైపు చూశారు. తన చేతులతోనే అతనికి దుమల్లా (తలపాగా) కట్టి, గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ తరువాత బాబా అజిత్ సింగ్, ఐదుగురు సిక్కులతో కలిసి, తన గొప్ప ధైర్యం, పరాక్రమం మరియు ఆయుధ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ యుద్ధభూమిలోకి వేగంగా దూసుకెళ్లారు.

మొఘల్ సైనికులు అలల మాదిరిగా ముందుకు దూకారు. కానీ అజిత్ సింగ్ పర్వతంలా స్థిరంగా నిలబడ్డాడు. ఆయన పోరాటం చూసి శత్రు సైన్యాలు భయాందోళనలకు గురయ్యాయి. కొన్ని నిమిషాల్లోనే, ఖల్సాకు చెందిన ఆ బహదూర్లు వందలాది మంది శత్రువులను అంతం చేశారు. సుదీర్ఘ, భీకర పోరాటంలో.. లెక్కలేనంత మంది మొఘల్ సైనికులు.. ఆయన చుట్టూ నేలకూలారు. అయినప్పటికీ ఆయన ధైర్యంగా పోరాడుతూనే ఉన్నారు. బాబా అజిత్ సింగ్ మొదట తన కృపాణ్ (కత్తి) ఉపయోగించి పోరాడాడు. అది విరిగినప్పుడు, నేజా (ఈటె) తో పోరాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత, తన తల్వార్ (ఖడ్గం)తో పోరాడాడు. బాబా అజిత్ సింగ్ కత్తి శత్రువును తాకిన ప్రతిసారీ, వారు ముక్కలు ముక్కలయ్యేవారు. చివరకు, సాహిబ్‌జాదాను మొఘల్ సైన్యం చుట్టుముట్టగా, ఆయన వీర మరణం పొందారు.

సాహిబ్‌జాదా జుఝార్ సింగ్ త్యాగం

 

వెంటనే, 13 ఏళ్ల సాహిబ్‌జాదా జుఝార్ సింగ్.. తన తండ్రి వద్దకు వచ్చారు. “పితా జీ,” అని గట్టిగా అన్నారు. “నా సోదరుడు తన ప్రాణాలను అర్పించారు. నన్ను కూడా అతనిని అనుసరించడానికి అనుమతి ఇవ్వండి” అని అన్నారు. గురు జీ మళ్ళీ తన రెండవ కుమారుడి దుమల్లా కట్టి, కౌగిలించుకుని, నుదిటిపై ముద్దుపెట్టి, ఇద్దరు పంజ పియారేలు మరియు మరో ముగ్గురు సింగ్‌లతో కలిసి యుద్ధభూమిలోకి ప్రవేశించడానికి అనుమతించారు. వారందరూ కలిసి ఒక గట్టి వృత్తాకార పోరాట వ్యూహాన్ని ఏర్పరచారు. లోపలికి చొరబడటానికి ప్రయత్నించిన వారెవరైనా తక్షణమే మరణించారు. మొఘలులు అన్ని దిశల నుండి ఒత్తిడి పెంచడం ప్రారంభించినప్పుడు, జుఝార్ సింగ్ తన విల్లును పారేసి, తన ఖండా (రెండు అంచులున్న కత్తి) ను తీసి, భయం లేకుండా దాడి చేశాడు. గాయపడినప్పటికీ, ఆయన ముందుకు సాగుతూనే ఉన్నారు. కొద్దిసేపటికే, ఆయన కూడా వీర మరణం పొందారు. కానీ ప్రతి గాయం ఆయన గుండెలపైనే పడింది, వీపుపై ఒక్కటి కూడా పడలేదు.

 

కోట లోపల, సిక్కుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కేవలం 11 మంది సింగ్‌లు మాత్రమే మిగిలారు. ఇద్దరు పంజ పియారేలు, భాయి మన్ సింగ్, భాయి సంగత్ సింగ్, భాయి సంత్ సింగ్ మరియు మరో ఆరుగురు మాత్రమే. వారు గురువును పారిపోవాలని వేడుకున్నారు. అదే సమయంలో.. గురువును పోలి ఉన్న భాయి సంగత్ సింగ్, గురువు జీ దుస్తులు ధరించి యుద్ధభూమిలోకి వెళ్లారు. సంగత్ సింగ్ యుద్ధభూమిలోకి అడుగుపెట్టినప్పుడు, ఆయన మొఘల్ సైన్యంతో భీకరంగా పోరాడారు. ఈలోగా గురు జీ, ముగ్గురు సిక్కులతో కలిసి, కటిక చీకటిలో తప్పించుకున్నారు.

 

1704 నాటి ఆ మరువలేని రోజు వేకువ జామున, మొఘలులు చమ్‌కౌర్ మట్టి కోటపై భయంకరమైన చివరి దాడిని ప్రారంభించారు. గంటల తరబడి నిరంతరంగా దాడి చేసిన తరువాత, వారు గోడలను బద్దలు కొట్టారు. కానీ వెంటనే వారు భాయి సంగత్ సింగ్, భాయి సంత్ సింగ్ మరియు మిగిలిన కొద్దిమంది సింగ్‌లు గుర్రాలపై స్వారీ చేస్తూ మెరుపులా బయటకు రావడం చూశారు. అన్ని వైపుల నుండి చుట్టుముట్టబడినప్పటికీ, వారు శత్రువుల వరుసలను చీల్చుకుంటూ మొఘల్ దళాలలో భయాన్ని సృష్టించారు, చివరకు వారు వీర మరణం పొందారు. తాము గురు గోవింద్ సింగ్ జీని చంపామని నమ్మి, మొఘలులు ఉత్సవాలు చేసుకున్నారు. అప్పటికే గురువు తప్పించుకున్నారని వారికి తెలియదు. కానీ వెళ్లేముందు, గురు సాహిబ్ ఒక ఎత్తైన దిబ్బ నుండి తన కొమ్ము ఊది, “పీర్-ఏ-హింద్ రవాద్!” (భారతదేశ పీర్ (గురువు) వెళ్తున్నారు) అని ప్రకటించారు.