
( డిసెంబరు 16 – బోయి భీమన్న వర్ధంతి )
సమాజం యొక్క ఔన్నత్యం మానవవికాసంతోనే ఉంటుందని, తనను తాను వికసింపచేసుకున్న మానవతామూర్తి భీమన్న. అందుకే ఆయన కవిత్వంలో మానవీయకోణాలు దర్శనమిస్తూ ఉంటాయి. వస్తువు ఏదైనా మానవీయ కోణాన్ని చూపించడం భీమన్న రచనల్లో కానవచ్చే ప్రత్యేకత. మనిషిగా ఎదుగుతూ, అందరినీ మనుషులుగా ఎదగమని ఉద్భోదిస్తూ, సమాజంలో కానవచ్చే అమానుష సంఘటనలకు చలించిపోతూ, మానవత్వం కోసం అక్షరాలతో అన్వేషణ సాగించిన మహాద్రష్ట బోయి భీమన్న. సమాజంలోని అసమానతలను గుర్తించిన భీమన్న మానవ సంబంధాల మెరుగుకై ఆరాటపడ్డాడు. మానవత్వాన్ని ఉద్దీపనం చేయడంకోసం ముందుకు అడుగులు వేశారు.
డాక్టర్ బోయి భీమన్న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పుల్లయ్య, నాగమ్మ దంపతులకు 1911 సెప్టెంబర్ 19న జన్మించాడు. భీమన్న కవిగా కలంపట్టేనాటికి, సమాజంలో తనకు సరిపడని విషయాలను అంటే సమస్యలను గుర్తించి, వాటిపై అక్షరయుద్ధాన్ని ప్రకటిoచాడు. సమాజంలోని అసమానతలపై గళమెత్తిన భీమన్న సాహిత్యంలో, సమాజంలోని అన్ని కోణాలను స్పృశించిన సంఘటనలు కోకొల్లలు. సమాజాన్ని నిరంతరం గమనించిన భీమన్న అసమసమాజంలోని రుగ్మతలను బట్టబయలు చేశారు. వాటి నిర్మూలనకై నిరంతరాయంగా అక్షర తూణీరాల్ని సంధించాడు. సమాజానికి తన కవిత్వం ద్వారా దిశానిర్దేశం చేశారు. సుఖసంతోషాలతో కూడిన సమసమాజస్ధాపన కోసం కలలు గన్నారు. ఆ కలలను సాకారం చేయమని తన సాహిత్యం ద్వారా ప్రజలకు ఉద్భోదించారు.
కవిగా సమాజ ఔన్నత్యాన్ని స్వప్నించిన మహాస్వాప్నికుడు భీమన్న. సమాజశ్రేయస్సును కాంక్షిస్తూ మానవతను అభిలషిస్తూ ఆయన సృష్టించిన సాహిత్యం అజరామరం. అందుకే సమసమాజ స్ధాపనలో అవి నిత్యమూ ప్రజలను ఉత్తేజ పరుస్తూనే ఉంటాయి. ‘‘వ్యక్తుల వికాసమే జాతి. జాతుల వికాసమే వసుధ. వసుధైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలం’’ అన్నది భీమన్న తాత్విక భూమిక. గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చిన బోయి భీమన్న అత్యాధునిక సాహిత్య భీష్ముడు. కౌరవుల సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూనే భీష్ముడు పాండవుల విజయాన్ని అభిలషించినట్లుగా భీమన్న కూడా వైదిక సమాజ వైభవాన్నికొంతవరకు ఆమోదిస్తూనే అంబేడ్కర్ తాత్విక చైతన్యం భారతదేశంలో విస్తరించాలని ఆకాంక్షించాడు. కులమతాల కంటే మానవతకు ప్రాధాన్యతనిచ్చిన్న బోయి భీమన్న డిసెంబరు 16, 2005న తుదిశ్వాస విడిచారు. సంస్కరణ, జాతీయవాద దృష్టి కలగలిసిన అద్భుత సమరసతా కవితామూర్తి డాక్టర్ బోయి భీమన్న ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేద్దాం…సమైక్య, సమరస భారతాన్ని నిర్మిద్దాం.





