News

సౌర తుపాను నిగ్గు తేల్చడంలో ఆదిత్య-ఎల్ – 1 తోడ్పాటు

168views

రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో గత ఏడాది సంభవించిన బలమైన సౌర తుపాను గురించి శోధించడంలో శాస్త్రవేత్తలకు భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్‌-1 సౌర అబ్జర్వేటరీ సాయం అందించింది. అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలతో కలిసి ఇది ఆ పరిణామంపై దృష్టిసారించింది. నాటి సౌర తుపాను ఎందుకు అంత అసాధారణంగా ఉందన్నది గుర్తించడంలో సాయపడిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. అత్యంత కచ్చితత్వంతో అయస్కాంత క్షేత్ర కొలతలను అందించడం ద్వారా ఈ కసరత్తులో తోడ్పాటు అందించిందని పేర్కొంది.

గత ఏడాది మేలో సంభవించిన ఆ సౌర తుపానుకు ‘గ్యానన్స్‌ స్టార్మ్‌’ అని పేరు పెట్టారు. అది భూవాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. నాడు సూర్యుడిలో విస్ఫోటాలూ చోటుచేసుకున్నాయి. వీటిని కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ (సీఎంఈ)గా పిలుస్తారు. వీటిలో తీవ్రస్థాయి వేడి వాయువులు, అయస్కాంత శక్తితో కూడిన బబుల్స్‌ ఉంటాయి. వీటివల్ల భూఅయస్కాంత క్షేత్రం తీవ్ర కుదుపులకు లోనైంది. కొన్నిసార్లు నింగిలోని ఉపగ్రహాలకు, నేలపైనున్న పవర్‌ గ్రిడ్లకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

గ్యానన్స్‌ స్టార్మ్‌కు సంబంధించి భారత శాస్త్రవేత్తలు ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. ‘‘ఆ సౌరతుపానులో సూర్యుడి అయస్కాంత క్షేత్రాలకు సంబంధించి అసాధారణ తీరును గమనించాం. ఈ క్షేత్రాలు సౌర తుపానులో మెలితిరిగిన తాళ్లలా ఉంటాయి. అవి విచ్ఛిన్నం కావడం, తిరిగి అతుక్కోవడం జరుగుతుంటుంది. సాధారణంగా ఒక సీఎంఈలో మెలితిరిగిన ‘అయస్కాంత తాడు’ ఒకటి ఉంటుంది. అవి పుడమిని చేరుకోగానే భూఅయస్కాంత కవచంతో చర్య జరుపుతాయి. గ్యానన్స్‌ స్టార్మ్‌లో మాత్రం ఇది భిన్నంగా జరిగింది. అందులో రెండు సీఎంఈలు విశ్వంలో పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఫలితంగా ఒకదానిలోని అయస్కాంత క్షేత్ర రేఖలు తెగిపోయి.. తిరిగి అనేక విధాలుగా అతుక్కున్నాయి. ఈ ప్రక్రియను మ్యాగ్నెటిక్‌ రీకనెక్షన్‌ అంటారు. ఇలా అకస్మాత్తుగా అయస్కాంత క్షేత్రం తీరు మారిపోవడం వల్ల సౌర తుపాను తీవ్రంగా మారింది. నాడు రేణువులు అకస్మాత్తుగా వేగాన్ని అందుకోవడాన్ని ఉపగ్రహాలు గుర్తించాయి. దీన్నిబట్టి వాటి శక్తి పెరిగినట్లు స్పష్టమవుతోంది. మ్యాగ్నెటిక్‌ రీకనెక్షన్‌కు ఇది నిదర్శనం’’ అని అందులో వివరించారు.